Friday, May 3, 2024

U19 Asia Cup | అండర్‌ – 19 ఆసియా కప్ టైటిల్ దక్కించుకున్న బంగ్లాదేశ్

దుబాయ్‌ వేదికగా జరిగిన అండర్‌ – 19 ఆసియా కప్‌ను బంగ్లాదేశ్‌ సొంతం చేసుకుంది. ఇవ్వాల జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో యూఏఈని చిత్తుగా ఓడించి బంగ్లాదేశ్ విజయం సాదించింది. ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 282 పరుగుల స్కోరు చేయగా.. ఛేదనలో యూఏఈ బ్యాటర్లు 24.5 ఓవర్లలో 87 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 195 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేయ‌గా.. ఆ జ‌ట్టు ఓపెనర్‌ అషికర్‌ రెహ్మాన్‌ షిబ్లి 129 సెంచ‌రీతో చెల‌రేగాడు. చౌదురి ఎండి రిజ్వాన్ 60, అరిఫుల్‌ ఇస్లాం 50 ప‌రుగులతో హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. యూఏఈ బౌలర్లలో అయ్మన్‌ అహ్మద్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఇక‌, ఛేదనలో యూఏఈ దారుణంగా విఫ‌ల‌మైంది. ఆ జట్టులో ధ్రువ్‌ పరశర్‌ 25 (నాటౌట్) టాప్‌ స్కోరర్ గా నిలిచాడు. అతడి తర్వాత అక్షత్‌ రాయ్‌ (11) మాత్రమే డబుల్‌ డిజిట్‌ స్కోరుచేశాడు. మిగిలినవాళ్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో ఆ జట్టుకు భారీ ఓటమి తప్పలేదు. బంగ్లా బౌలర్లలో మరూఫ్‌ మృధ, రోహనత్‌ బోర్సన్‌లు తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఈ టోర్నీలో భాగంగా సెమీస్‌లో బంగ్లాదేశ్‌.. భారత్‌ను ఓడించగా యూఏఈ పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఫైనల్‌ చేరిన విషయం విదితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement