Thursday, May 2, 2024

Weddings in India – “వెడ్ ఇండియా”కు ప్ర‌ధాని మోడీ పిలుపు…

ఉత్త‌రాఖండ్ – ‘మేకిన్ ఇండియా’లానే ‘వెడ్ ఇన్ ఇండియా’ ఉద్యమాన్ని అందరూ భుజాలకెత్తుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఇటీవలి కాలంలో డెస్టినేషన్ వెడ్డింగులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని డెస్టినేషన్ వెడ్డింగ్స్ స్థానంలో దేశంలోనే వివాహాలు జరుపుకోవాలని సంపన్నులను కోరారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో రెండు రోజులపాటు జరిగే ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 మోడీ ప్ర‌సంగిస్తూ, వెడ్ ఇన్ ఇండియా ద్వారా దేశంలో వివాహాల ఉద్యమం రావాలని ఆకాంక్షించారు. ‘‘మిలియనీర్లు, బిలియనీర్లకు నేను చెప్పేది ఒక్కటే. పెళ్లిళ్లను దేవుడే నిర్ణయిస్తాడని మనం భావిస్తాం. మరి దేవుడు ఒక్కటి చేసిన జంట తమ కొత్త ప్రయాణాన్ని దేవుడి పాదాల నుంచి కాకుండా విదేశాల్లో ఎందుకు ప్రారంభిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను యువతను కోరేది ఒక్కటే. మేకిన్ ఇండియా లానే వెడ్ ఇన్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించండి’’ అని పేర్కొన్నారు.

ఇండియాలో పెళ్లి చేసుకోవడాన్ని చాలామంది చిన్నచూపు చూస్తూ విదేశాలకు పరుగులు తీస్తున్నారని, విదేశాల్లో పెళ్లాడడం సంపన్నులకు ఫ్యాషన్ అయిపోయిందని విమర్శించారు. వచ్చే ఐదేళ్లలో ప్రతి కుటుంబంలో ఒకరు తమ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను దేవభూమి ఉత్తరాఖండ్‌లో జరుపుకోవాలని కోరారు. ప్రతి ఏడాది ఇక్కడ 5 వేల వివాహాలు జరిగితే కొత్త మౌలిక సదుపాయాలు ఇక్కడ అందుబాటులోకి వస్తాయన్నారు. అప్పుడది ప్రపంచంలోనే అతిపెద్ద వెడ్డింగ్ డెస్టినేషన్ అవుతుందని పేర్కొన్నారు. మనం తలచుకుంటే అదేమంత పెద్ద విషయం కాదని ప్రధాని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement