Sunday, May 19, 2024

విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేవి పాఠశాలలే.. వెల్లూర్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఈ శతాబ్దపు మార్పులకు అనుగుణంగా, సాంకేతిక ప్రపంచానికి తగ్గట్టుగా విద్యార్థుల్లో ఆసక్తి, సృజనాత్మకత, సామర్థ్యాన్ని పెంపొందించడంలో పాఠశాలలు కీలక పాత్ర పోషించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థల ఆధ్వర్యంలో చెన్నై సమీపంలో ఏర్పాటు చేసిన వెల్లూర్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు తరగతి గదుల్లో విద్యాభ్యాసంతో పాటు ప్రకృతి ఒడిలో, సమాజంలోని వివిధ వర్గాలతో అనుసంధానమై పనిచేయడాన్ని, వివిధ కళలు, సంస్కృతులను నేర్చుకునేలా ప్రోత్సహించాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

ప్రాచీన భారత విద్యావిధానమైన గురుకుల వ్యవస్థ విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో దోహదపడిందన్న వెకయ్య, విద్యార్థి ప్రవర్తనను, ఆలోచనా విధానాన్ని సరైన మార్గంలో నిలపడం మీదే నాడు గురువులు దృష్టి కేంద్రీకరించేవారని గుర్తు చేశారు. నాటి గురు-శిష్య పరంపరను పునర్వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. విలువలతో కూడిన, సమగ్రమైన విద్యాను అందించడంపై పాఠశాలలు దృష్టిసారించాలన్న ఆయన, తద్వారా ప్రతివిద్యార్థిలోనూ సానుకూల దృక్పథాన్ని, వారిలో దాగున్న సామర్థ్యాన్ని వెలికితీసి ప్రోత్సహించేందుకు వీలు పడుతుందన్నారు. విలువల్లేని విద్య అసలు విద్యే కాదని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.

పాఠశాలల్లో విద్యతో పాటు యోగా, శారీరక వ్యాయామ కార్యక్రమాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్ర మంత్రి టీఎం అన్బరసన్, వీఐటీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛాన్స్‌లర్ డాక్టర్ విశ్వనాథన్, చైర్మన్ జీవీ సెల్వమ్, ఉపాధ్యక్షుడు డాక్టర్ శేఖర్ విశ్వనాథన్‌తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement