Monday, July 22, 2024

TS | డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీలో కొత్త నిబంధనలు.. జూన్‌ 1 నుంచి అమల్లోకి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీకి ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువస్తోంది. ఇప్పటి వరకు ఉన్న నింధనలలో కొన్నింటిని సవరించింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌, ట్రైనింగ్‌ సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్‌ జూన్‌ 1, నుంచే అమలులోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిబంధనల మార్పు అంశంపై ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇకపై ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లకుండానే డ్రైవింగ్‌ టెస్ట్‌ పాస్‌ కావొచ్చు.

కొత్త నిబంధనల్లో ఎలాంటి మార్పులు?

నూతన నిబంధనల ప్రకారం ఇకపై వాహనదారులు ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం(ఆర్‌టీఓ)లో డ్రైవింగ్‌ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు. ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లడానికి బదులుగా మీరు ప్రైవేట్‌ ట్రైనింగ్‌ సెంటర్ల వద్ద డ్రైవింగ్‌ టెస్టుకు హాజరుకావచ్చు. వారు డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించి వాహనదారుడికి ఓ సర్టిఫికెట్‌ ఇస్తారు.

ఆ సర్టిఫికెట్‌ తీసుకుని ఆర్‌టీఓ ఆఫీసులో ఇవ్వాల్సి ఉంటుంది. దానితో పాటు పలు పత్రాలు సమర్పించాలి. ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం నేరుగా ఆర్‌టీఓ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించడం. పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారా లైసెన్స్‌ జారీ చేయడం. దీని ద్వారా సమయం కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌ డ్రైవింగ్‌ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు పలు నిబంధనలు పెట్టింది. లైట్‌ మోటార్ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణ కోసం అయితే ఒక ఎకరం భూమి కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అలాగే ఫోర్‌ వీలర్‌ శిక్షణ కోసం అయితే మరో 2 ఎకరాల భూమి అదనంగా ఉండాలని పేర్కొంది. అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉంటే వారికి ప్రభుత్వం లైసెన్స్‌ జారీ చేస్తుంది.

- Advertisement -

అలాగే అందులో ఉండే ట్రైనర్లకు కనీసం హైస్కూల్‌ డిప్లామా అర్హత తప్పనిసరి చేసింది కేంద్రం. కనీసం 5 ఏళ్ల డ్రైవింగ్‌ అనుభవం ఉండాలని నొక్కి చెప్పింది. బయోమెట్రిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సిస్టమ్స్‌ మౌలిక అంశాలపై అవగాహన ఉండాలని తెలిపింది. లైట్‌ మోటార్‌ వెహీకల్‌ శిక్షణ 4 వారాల్లో లేదా కనీసం 29 గంటల్లో పూర్తి చేయాలని వివరించింది.

అలాగే ఈ శిక్షణ రెండు విభాగాలుగా ఉండాలి.. థియరీ కోసం 8 గంటలు, ప్రాక్టికల్‌ కోసం 21 గంటలు కనీసం కేటాయించాల్సి ఉంది. హెవీ మోటార్ వెహీకల్స్‌ అయితే 38 గంటల కనీస శిక్షణ.. 8 గంటలు థియరీ ఎడ్యుకేషన్‌, 31 గంటలు ప్రాక్టికల్‌ శిక్షణ తప్పనిసరి. కొత్తగా లైసెన్స్‌ తీసుకునేందుకు యత్నించేవాళ్లు ఈ నిబంధనలు దృష్టిలో ఉంచుకోవాలని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement