Sunday, April 28, 2024

ముందుకు సాగని ఖరీఫ్‌.. 16 లక్షల ఎకరాలలో తగ్గిన సాగు

అమరావతి : ఆంధ్రప్రభ : ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు ఆలస్యమైంది. ప్రధానంగా రుతు పవనాలు ఆలస్యం కావడం, రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటిమట్టం తగ్గడం.. దీంతో కాలువలకు నీరు విడుదల కాకపోవంతో ఖరీఫ్‌కు కష్టాలు మొదలయ్యాయి. అయితే గత నెలలో కురిసిన వర్షాల కారణంగా ఎట్టకేలకు ఈ ఖరీఫ్‌లో ఇప్పటికి రాష్ట్రం సగటు సాధారణ వర్షపాత స్థితికొచ్చింది. అయితే ఐదు జిల్లాల్లో, 200 పైగా మండలాల్లో తక్కువ వర్షమే ఉంది. జులై మూడవ వారంలో నాటికి 16 జిల్లాల్లో, 370 మండలాల్లో తక్కువ వర్షం నమోదుకాగా, జులై నాల్గవ వారంలో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం వర్షాభావం నుంచి తెప్పరిల్లింది.

జూన్‌ 1 నుంచి జులై 27 వరకు రాష్ట్ర సగటు- సాధారణ వర్షపాతం 239.4 మిల్లీమీటర్లు కాగా 239 మిమీ నమోదైంది. తిరుపతి, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, నెల్లూరు, కోనసీమ జిల్లాల్లో ఇంకా వర్షపు లోటు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఎడతెరిపిలేని భారీ వర్షాలకు అక్కడక్కడ పంటలు దెబ్బతిన్నప్పటికీ, వ్యవసాయ పనులకు ఆటంకం కలిగినప్పటికీ మొత్తంగా సేద్యానికి ఊతమిచ్చాయి. ఇదిలా వుండగా రాయలసీమ, ఇతర మెట్ట ప్రాంతాల్లో అదను తప్పాక పదును అన్నట్లుంది పరిస్థితి.

- Advertisement -

ప్రధానంగా వేరుశనగ పంట తొలకరి వానలకు జూన్‌, జులైలో ముమ్మరంగా సాగవుతుంది. ఈ మారు ఆలస్యంగా వర్షాలు పడటంతో ఇప్పుడు వేరుశనగ సాగుకు పదునొచ్చినా అదను తప్పిందని రైతులు చెపుతున్నారు. కొన్నేళ్లుగా వాణిజ్య పంట పత్తి జులై చివరాఖరికి బాగా సాగవుతోంది. జులై మూడవ వారం వరకు సరైన వానల్లేక ఆ పంట సాగు సైతం గణనీయంగా తగ్గింది. కృష్ణా, గోదావరి డెల్టా కాల్వలకు జూన్‌ మొదటి వారంలోనే నీరు విడుదల చేసిప్పటికీ ఆయా ప్రాంతాల్లో వరి నాట్లు ఊపుగా సాగలేదు. సాధారణంగా ముందస్తుగా ఖరీఫ్‌ పంటలు సాగు చేసే ఉత్తరాంధ్రలో కూడా అదే పరిస్థితి.

పెన్నా డెల్టా కింద నెల్లూరు, తిరుపతిలో వరి కాస్తంత పర్వాలేదనిపిస్తోంది. ఖరీఫ్‌ నార్మల్‌ సాగులో ఇప్పటికి 27 శాతమే సాగైంది. జులై ఆఖరు వరకు కావాల్సిన సాధారణ సాగులో 55 శాతం సాగు నమోదైంది. ఈ పాటికి కావాల్సిన సాగులో 16 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. సీజన్‌ నార్మల్‌లో ఆహారధాన్యాలు 25 శాతం సాగయ్యాయి. వరి 25 శాతం, తృణధాన్యాలు 41 శాతం, పప్పుధాన్యాలు 17 శాతం, వేరుశనగ 25 శాతం, మొత్తం నూనెగింజలు 27 శాతం, పత్తి 33 శాతం సాగైంది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో సాధారణ సాగులో 25 శాతం లోపు సాగు నమోదైంది. తొమ్మిది జిల్లాల్లో 26-50 శాతం సేద్యం జరిగింది. తూర్పుగోదావరిలో 51-75 శాతం, తిరుపతిలో 76-100 శాతం పంటలు సాగయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement