Thursday, May 9, 2024

Delhi | న్యాయం గెలిచింది.. రాహుల్ గెలిచారు.. సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేతల హర్షం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పుతో న్యాయం గెలిచిందని, రాహుల్ గాంధీ గెలిచారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు మిఠాయిలు పంచారు. పార్టీ జెండాలు పట్టుకుని సందడి చేశారు. అనంతరం గిడుగు రుద్రరాజు ఏపీ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

సుప్రీంకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. రాజ్యాంగ వ్యవస్థలు, కోర్టుల మీద ఉన్న నమ్మకంతోనే అన్ని విధాలుగా పోరాటాలు చేస్తున్నామని చెప్పారు. సూరత్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదని, చిన్న పరువు నష్టం కేసులో రెండు సంవత్సరాల జైలు శిక్ష అనేది ఎప్పుడు చూడలేదని విస్మయం వ్యక్తం చేశారు. గుజరాత్ హైకోర్టులో ఊరట లభిస్తుందనుకున్నా అక్కడే నిరాశే ఎదురైందని గుర్తు చేశారు. చిన్న నేరానికి పెద్ద శిక్ష విధించారనిచాలా స్పష్టంగా జడ్జిమెంట్ కాపీలో మెన్షన్ చేశారని గిడుగు వివరించారు.

- Advertisement -

దేశ చరిత్రలో ఐపీసీ సెక్షన్లలో ఎప్పుడు లేని విధంగా రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ఆ జైలు శిక్షను పరిగణనలోకి తీసుకొని లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని వాపోయారు. రాహుల్ తిరిగి లోక్‌సభకు వెళ్లి తన గళం విప్పి పోరాటం చేస్తారని తెలిపారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి వచ్చిన ఆదరణను చూసి బీజేపీ పథకం ప్రకారం కక్ష సాధింపు ధోరణితో కేసులు బనాయిస్తోందని గిడుగు రుద్రరాజు ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పుని పరిగణనలోకి తీసుకుని రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రధాని మోదీకి, ఆదానీలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తారని ఆయన గిడుగు తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement