Sunday, May 5, 2024

విభజన నష్టాల నుంచి లభించని ఉపశమనం.. బడ్జెట్‌పై చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ మారగాని భరత్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: శ్రీరాముడిని 14 సంవత్సరాల పాటు వనవాసానికి పంపి అన్యాయం చేసిన చందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 13 ఏళ్లుగా అన్యాయానికి గురవుతోందని రాజమండ్రి ఎంపీ (వైఎస్సార్సీపీ) మారగాని భరత్ అన్నారు. గురువారం లోక్‌సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన వైఎస్సార్సీపీ తరఫున మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం జరిగిన నాలుగేళ్లతో పాటు విభజన అనంతరం గత తొమ్మిదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి లేక సతమతమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో పొందుపర్చిన హామీలు ఏవీ పూర్తిస్థాయిలో అమలుకావడం లేదని, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విషయంలో సవతి ప్రేమ చూపుతోందని ఆరోపించారు. గత యూపీఏ సర్కారు రాజకీయ లబ్ది కోసం కేక్ ని కట్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారని భరత్ అన్నారు.

- Advertisement -

తద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం కోసమే నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకుంటామని చెప్పారని గుర్తుచేశారు. ఆదాయం కల్గిన హైదరాబాద్ నగరం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో ఉండిపోయిందని, దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కొత్తగా ఏర్పడ్డట్టయిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర ప్రభుత్వ సహాయంలో ప్రాధాన్యత, పన్ను రాయితీలతో పరిశ్రమలు, పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉండేదని వివరించారు. తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, విభజన చట్టంలో పొందుపర్చినవాటినే అమలు చేయాలని కోరుతున్నామని తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కూడా ఆలస్యమవుతోందని గుర్తుచేశారు.

పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ సవరించిన అంచనాలను ఆమోదించాలని చాలాకాలంగా కోరుతున్నామని, జాప్యం జరిగే కొద్దీ ఈ అంచనా వ్యయం పెరుగుతూనే ఉంటుందని భరత్ తెలిపారు. ఇప్పటికే రూ. 55 వేల కోట్లు దాటిందని, అంచనా వ్యయం పెరిగే కొద్దీ వృధా అయ్యేది ప్రజాధనమే అన్న విషయం మర్చిపోవద్దని అన్నారు. దుగరాజపట్నం వద్ద మేజర్ పోర్టు నిర్మాణానికి సాంకేతికంగా ఇబ్బందులున్నాయని ప్రత్యామ్నాయంగా రామాయపట్నం వద్ద ఏర్పాటు చేయాలని సూచించినప్పటికీ కేంద్రం నుంచి సరైన స్పందన లేదని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల పరిస్థితి కూడా అలాగే తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్రం ఎందుకు సవతి ప్రేమను ప్రదర్శిస్తుందో అర్థం కావడం లేదని అన్నారు.

విభజన చట్టంలో గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేయాలని ఉందని గుర్తుచేశారు. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్ నుంచి ముడి చమురు, గ్యాస్ నిక్షేపాలను వెలికి తీసి, మరో చోటకు తీసుకెళ్లి శుద్ధి చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో చమురు శుద్ధి కర్మాగారాన్ని కాకినాడ – విశాఖ ఏరియాలో ఎందుకు ఏర్పాటు చేయడం లేదో చెప్పాలని అన్నారు. పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలంటే వయబిలిటీ గ్యాప్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలని కేంద్రం చెబుతోందని, గుజరాత్, ఒడిశాలో ఉన్న పెట్రోకెమికల్ కాంప్లెక్సులకు కూడా ఇలాగే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉందా అని ప్రశ్నించారు. అక్కడ లేనప్పుడు ఏపీలో ఏర్పాటు చేయడానికి మాత్రమే ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు.

భారత్ మార్ట్ ఏర్పాటు చేయండి

ఆత్మనిర్భర్ భారత్ అంటూ దేశీయం తయారీ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు దేశీయ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మారగాని భరత్ ఒక సూచన చేశారు. భారతీయ వస్తువులను కొనండి అంటూ కోరినంత మాత్రాన సరిపోదని, దేశంలో ‘భారత్ మార్ట్’ పేరుతో చిన్న చిన్న గ్రామాల వరకు లోకల్ మార్టులు ఓపెన్ చేసి, అక్కడ దేశంలో తయారైన వస్తువులను మాత్రమే అందుబాటులో ఉంచాలని సూచించారు. అప్పుడే దేశీయ ఉత్పత్తుల వినియోగం పెరుగుతుందని, ఆత్మనిర్భర భారత్ కల సాకారమవుతుందని అన్నారు. మరోవైపు దేశంలో ద్రవ్యలోటు గురించి మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ఆర్థిక స్థితి సరిగా లేనప్పటికీ మన దేశంలో ద్రవ్యలోటును 10% నుంచి 5.9%కు కట్టడి చేయడంలో ఆర్థిక మంత్రి సఫలీకృతం అయ్యారని మెచ్చుకున్నారు. అయితే గ్యాస్ ధరల భారాన్ని తగ్గించి ఉంటే మహిళా ఓటర్లను ఆకట్టుకునే అవకాశం ఉండేదని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement