Saturday, December 7, 2024

ఉపాధి నిధుల తగ్గింపుతో వలసలు తప్పవా? గడచిన ఏడాది కేటాయింపులతో పోలిస్తే 17.8 శాతం తక్కువ

అమరావతి, ఆంధ్రప్రభ: ఈసారి కేంద్ర బడ్జెట్‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాని (ఎంజీఎన్‌ఆర్‌జీఏ)కి కేటాయింపులు తగ్గించడం వల్ల వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరీ ముఖ్యంగా రాయలసీమ వంటి ప్రాంతాలతోపాటు వెనుకబడిన జిల్లాలో దీని ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఇదే అంశంపై నిధుల కోత వల్ల రైతు కూలీలు నష్టపోతారని, ఫలితంగా ఇతర రాష్ట్రాల్రకు వలసలు పెరుగుతాయని అనంతపురం జిల్లాలో అనేక దశాబ్దాలుగా రైతు కూలీల సంక్షేమంతో అనుబంధం ఉన్న యంగ్‌ ఇండియా ప్రాజెక్ట్‌ వ్యవస్థాపకుడు నరేంద్ర బేడీ చెప్పిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.

2023 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి కేటాయింపులను రూ.60 వేల కోట్లకు తగ్గించింది, ఇది గత నాలుగేళ్లలో కేయటాంచిన వాటిలో కనిష్ట స్థాయిగా ఉంది. 2022-2023 బడ్జెట్‌ అంచనాలో కేటాయించిన రూ.73 వేల కోట్లతో పోలిస్తే ఇది 17.8 శాతం తక్కువగా ఉంది. ఇంకా, అనేక కరువు పీడిత ప్రాంతాలు కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లుల కారణంగా నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల కారణంగా పేదలు తమ జీవనోపాధి కోసం పట్టణ కేంద్రాలకు వలస వెళ్తున్నారు.

కొనసాగుతున్న వలసలు..

- Advertisement -

రాయలసీమలోని కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌ నుంచి రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాలకు, బయట ప్రాంతాలకు అనేక కుటు-ంబాలు వలస వెళ్లాయి. అదే తరహాలో అనంతపురం జిల్లాలోని మెజారిటీ గ్రామాల నుంచి నగరాలకు వలసలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుండి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) గ్రామీణ భారతదేశంలోని శ్రామిక పేదలకు జీవనాధారంగా పనిచేస్తుంది, ఇది కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో స్పష్టంగా నిరూపించబడింది.2021లో సగటు-న రూ. 200 రోజువారీ వేతనంతో 23 రోజుల పని దినాలు కల్పించి నెలకు సగటున రూ.1,500 ఆర్జించినట్లు ప్రజా సైన్స్‌ వేదిక తెలిపింది. 2020 నాటి నీతి ఆయోగ్‌ నివేదిక, గృహ ఆదాయం మరియు పేదరిక నిర్మూలనపై పథకం ప్రభావం చూపుతూ గ్రామీణ భారతదేశంలో సమ్మిళిత వృద్ధికి ఇది శక్తివంతమైన సాధనం అని కూడా పేర్కొంది.

కేటాయింపులు పెరిగితేనే..

కేటాయింపులో గణనీయమైన పెంపుదలతోనే పేదలకు సంవృద్ధిగా పనిదినాల సంఖ్యను పెంచడం సాధ్యమవుతుంది. ఉదాహరణకు ఒక్కొక్కరికి సగటున 60 రోజుల పనిని అందించడానికి దాదాపు రూ.1.1 లక్షల కోట్లు అవసరమైతే అదే 80 రోజుల వంతున పనిని అందించడానికి రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ పథకం కింద గత ఐదేళ్లలో వార్షిక సగటు వేతన పెరుగుదల 5.1 శాతంగా ఉంది. దీనిప్రకారం ప్రస్తుత సంవత్సరంలో సగటు-న ప్రతి వ్యక్తికి రోజుకు రూ.217.7 వేతనం వస్తుంటే అది వచ్చే సంవత్సరంలో రూ.229కి పెరగాల్సి ఉంది. అయితే, ఈపథకం కింద ప్రతి పేదవాడికి సగటున 48 రోజుల పని కల్పించడం తప్పనిసరనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే గత ఏడాది పెండింగ్‌లో ఉన్న వేతన బిల్లులను కూడా పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు చేసినట్లయితే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటన్నింటి దృష్ట్యా ఈఏడాది కేటాయింపును రూ.87,500 కోట్లకు పెంచాల్సి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఉదాహరణకు, జనవరి 2022లో పెండింగ్‌ బిల్లులు రూ.3,358 కోట్లు. ఇదే విధమైన పెండెన్సీని పరిగణనలోకి తీసుకుంటే, ఎంఎన్‌ఆర్‌జీఏ వ్యయం 2022-23లో కేటాయించిన దానికంటే ఎక్కువగా ఉండాల్సి ఉందని వారు పేర్కంటున్నారు. ఎంఎన్‌ఆర్‌జీఏ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పేదరిక వ్యతిరేక ప్రభుత్వ-ఉపాధి పథకంగా ప్రపంచ బ్యాంకుచే అభివర్ణించబడందని, ఆమేరకు కేటాయింపులు ఉన్నట్లయితే గ్రామాల్లో వలసల నిర్మూలనకు దోహదపడేదని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement