Friday, May 17, 2024

రిమోట్ ఓటింగ్‌పై పార్టీల అభిప్రాయాల సేకరణ జరుగుతోంది.. రాజ్యసభలో న్యాయ శాఖ మంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రిమోట్‌ ఓటింగ్‌ ప్రతిపాదనపై ఎన్నికల సంఘం వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతోందని న్యాయ శాఖ మంత్రి కిరెణ్‌ రిజుజు తెలిపారు. రాజ్యసభలో గురవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఓటింగ్‌ ప్రక్రియలో దేశంలోని వలస కార్మికుల భాగస్వామ్యం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గత ఏడాది డిసెంబర్‌ 28న ఒక నోట్‌ను జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలకు సర్క్యులేట్‌ చేసినట్లు చెప్పారు.

వలస ఓటరును ఏ విధంగా నిర్వచించాలి, వారు ఏ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించాలి, రిమోట్‌ ఓటింగ్‌ విధానం, వారి ఓట్ల లెక్కింపు, వారికి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఏ విధంగా వర్తింప చేయాలి, వారు స్వేచ్ఛగా, స్వతంత్రంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనువైన వాతావరణ కల్పిండం వంటి అంశాలపై అభిప్రాయాలు తెలియ చేయవలసిందిగా ఆ నోట్‌లో వివిధ రాజకీయ పక్షాలను కోరినట్లు మంత్రి వెల్లడించారు.

దీనికి అనుగుణంగానే వివిధ రాజకీయ పార్టీలతో ఈ ఏడాది జనవరి 16న చర్చలు నిర్వహించడం జరిగింది. రిమోట్‌ ఓటింగ్‌ విధానానికి సంబంధించి న్యాయ, పాలనా, సాంకేతికపరమైన అవరోధాలను ఏ విధంగా అధిగమించవచ్చునో ఈ నెల 28లోగా రాతపూర్వకంగా తమ అభిప్రాయలు, ఆలోచనలను తెలియచేయమని ఎన్నికల సంఘం వివిధ రాజకీయ పార్టీలను కోరినట్లు మంత్రి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement