Monday, May 6, 2024

త‌లలు అతుక్కొని పుట్టిన క‌వ‌ల‌ల‌కు విజ‌య‌వంతంగా స‌ర్జ‌రీ

ఇజ్రాయెల్‌లో గత ఏడాది ఇద్దరు చిన్నారులు తలలు అతుక్కుని జన్మించారు. ఏడాదిగా ఈ ఇద్ద‌రి త‌ల‌ల వెనుక భాగాలు క‌లిసే ఉన్నాయి. అయితే ఏడాది త‌ర్వాత డాక్ట‌ర్లు 12 గంట‌ల పాటు స‌ర్జ‌రీ చేసి విజ‌య‌వంతంగా వేరు చేశారు. బీర్షెబా న‌గ‌రంలోని సొరోకా మెడిక‌ల్ సెంట‌ర్‌లో గ‌త వారం ఈ స‌ర్జ‌రీ నిర్వ‌హించారు. ఈ స‌ర్జ‌రీకి 12 గంట‌లు ప‌ట్టినా.. దాని వెనుక కొన్ని నెల‌ల ప్రిప‌రేష‌న్ ఉంది. ప‌దుల సంఖ్య‌లో డాక్ట‌ర్లు శ్ర‌మించాల్సి వ‌చ్చింది. ప్రస్తుతం ఇద్ద‌రు పాప‌లు వేగంగా కోలుకుంటున్న‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. కృత్రిమ శ్వాస అవ‌స‌రం రాలేద‌ని, సొంతంగానే తిన‌గ‌లుగుతున్నార‌నీ సొరోకా ప్లాస్టిక్ స‌ర్జ‌రీ డిపార్ట్‌మెంట్ హెడ్ ఎల్డాడ్ సిల్బ‌ర్‌స్టీన్ చెప్పారు.

కాగా ఇది చాలా అరుదైన స‌ర్జ‌రీ. ఇప్పటి వ‌ర‌కు ప్ర‌పంచంలో కేవ‌లం 20సార్లు మాత్ర‌మే ఇలాంటి సర్జరీలు చేశారు. ఇజ్రాయెల్‌లో ఇదే తొలి ఆప‌రేష‌న్‌. ఈ స‌ర్జ‌రీకి కొన్ని నెల‌ల ముందు గాలితో నిండిన సిలికాన్ బ్యాగ్‌ల‌ను వాళ్ల త‌ల‌ల్లో అమ‌ర్చారు. వాళ్ల చ‌ర్మాన్ని కాస్త సాగ‌దీయ‌డానికి ఇలా చేశారు. స‌ర్జ‌రీలో భాగంగా ఇద్ద‌రి పుర్రెల‌ను వేరు చేసిన త‌ర్వాత కొత్త చ‌ర్మంతో దానిని సీల్ చేశారు. ఈ స‌ర్జ‌రీ కోసం ముందుగా ఈ క‌వ‌ల‌ల 3డీ వ‌ర్చువ‌ల్ రియాల్టీ మోడ‌ల్‌ను కూడా సృష్టించిన‌ట్లు సొరోకా చీఫ్ న్యూరోస‌ర్జ‌న్ మిక్కీ గిడియోన్ వెల్ల‌డించారు. తాము ఎలా అయితే ప్లాన్ చేశామో.. అంతా అలా సాఫీగా జ‌రిగిపోయింద‌ని ఆయ‌న అన్నారు. గ‌తేడాది ఆగ‌స్టులో జ‌న్మించిన ఈ క‌వ‌ల‌లు భ‌విష్య‌త్తులో పూర్తి సాధార‌ణ జీవితం గ‌డ‌ప‌నున్న‌ట్లు డాక్ట‌ర్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement