Wednesday, May 8, 2024

ఎస్సై ఉద్యోగం సాధించిన ట్రాన్స్ జెండర్!

ట్రాన్స్ జెండర్.. ఇప్పటికి మన దేశంలో వీరు పడుతున్న బాధలు అన్ని ఇన్ని కాదు.. ఎక్కడికెళ్లిన అవమానం.. అవహేళనలే.. కష్టపడి పని చేసుకుందామన్న వీరికి పని దొరకని పరిస్థితి…ఈ నేపథ్యంలో ట్రాన్స్ జెండర్ ఎస్సై ఉద్యోగం సాధించి సత్తా చాటింది. విద్య, ఉద్యోగాలు, ఇతర రంగాల్లో తాము ఎవరికీ తీసిపోమని ట్రాన్స్ జెండర్లు చాటి చెప్పేందుకు బాటలు వేసింది. తమిళనాడుకు చెందిన శివన్య అనే ఓ ట్రాన్స్ జెండర్ ఎస్తై ఉద్యోగం సాధించి సత్తా చాటింది. తిరువణ్ణామలైకి చెందిన శివన్య కామర్స్ లో డిగ్రీ పట్టా అందుకుంది. కొన్నాళ్ల కిందట లింగ మార్పిడి చేయించుకున్న శివన్యకు పోలీసు ఉన్నతాధికారి అవ్వాలనేది ఓ కల. అందుకే తమిళనాడు ప్రభుత్వ పోలీసు నియామక పరీక్షలకు హాజరైంది. ఫిజికల్ ఈవెంట్లలోనూ సత్తా చాటింది. ఆపై రాత పరీక్షలు, ఇంటర్వ్యూలోనూ శివన్య ప్రతిభ చాటింది.

ఈ క్రమంలో ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. నీకు పోలీస్ ఉద్యోగం కావాలా? అంటూ వెక్కిరింపులు ఎదురయ్యాయి. అవేవీ శివన్య స్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయి. అన్నింటా సత్తా నిరూపించుకున్న ఈ ట్రాన్స్ జెండర్ ఎస్ఐగా ఎంపికై, ఇటీవలే సీఎం స్టాలిన్ చేతుల మీదుగా నియామకపత్రం అందుకుంది. కాగా, తన లక్ష్యం డీఎస్పీ అని, ఎప్పటికైనా ఆ ఉద్యోగాన్ని సాధిస్తానని శివన్య ధీమాగా చెబుతోంది. తన ప్రస్థానంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉందని వివరించింది. కాగా, శివన్య సోదరుడు తమిళనిధి పోలీసు డిపార్ట్ మెంట్ లోనే పనిచేస్తున్నాడు. ఏదేమైనా శారీరక అవరోధాలను అధిగమించి ఓ ట్రాన్స్ జెండర్ పోలీసు అధికారిణిగా ఎంపిక కావడం స్ఫూర్తిదాయకం.

ఇది కూడా చదవండి: టీమిండియా ఘోర వైఫల్యం..లంక దే టీ20 సిరీస్..

Advertisement

తాజా వార్తలు

Advertisement