Saturday, April 27, 2024

Journey | పల్లె వెలుగు బ‌స్‌లో టౌన్‌ పాస్‌.. 18 నుంచి అందుబాటులోకి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రయాణికులను ఆకర్శించడం లక్ష్యంగా టీఎస్‌ ఆర్టీసీ మరో కొత్త పథకాన్ని ప్రకటించింది. కొత్తగా పల్లె వెలుగు టౌన్‌ బస్‌ పాస్‌ను ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చింది. మంగళవారం నుంచి కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, నల్లగొండ జిల్లా కేంద్రాలలో ప్రారంభం కానుంది. ఈమేరకు పల్లె వెలుగు టౌన్‌ బస్‌ పాస్‌కు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం బస్‌ భవన్‌లో టీఎస్‌ ఆర్టీసీ ఎండి విసి సజ్జన్నార్‌ ఆవిష్కరించారు. ఈ టౌన్‌ బస్‌ పాస్‌తో ప్రయాణికులు కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌లో 10 కి.మీ.లు, నిజామాబాద్‌, నల్లగొండలో 5 కి.మీ.ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు.

- Advertisement -

10 కి.మీ.ల పరిధికి నెలకు రూ.800, 5 కి.మీ.ల పరిధికి రూ.500గా పల్లె వెలుగు టౌన్‌ బస్‌ పాస్‌ ధరను సంస్థ ఖరారు చేసింది. ఇప్పటికే హైదరాబాద్‌, వరంగల్‌లో జనరల్‌ బస్‌పాస్‌ అందుబాటులో ఉంది. ఆ బస్‌ పాస్‌ను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కొత్తగా పల్లె వెలుగు టౌన్‌ బస్‌ పాస్‌ను సంస్థ తీసుకొచ్చింది. ఈ సందర్భంగా సజ్జన్నార్‌ మాట్లాడుతూ జిల్లా కేంద్రాలలో ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారనీ, వారి ఆర్థిక భారం తగ్గించేందుకు పల్లె వెలుగు టౌన్‌ బస్‌పాస్‌ను ఆరీసీ అందుబాటులోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు.

ముందుగా కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, నల్లగొండ జిల్లా కేంద్రాలలో ఈ ప్లాన్‌ను అమలు చేస్తున్నామనీ, ప్రయాణికుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను బట్టి మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారు. వాస్తవానికి 10 కి.మీ.ల పరిధికి టికెట్‌ ధర రూ.1200, 5 కి.మీ.ల పరిధికి రూ.800 ఉండగా, ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించాలని ఆ బస్‌ పాస్‌కు సంస్థ రాయితీ కల్పించిందని వెల్లడించారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ సాస్‌ను హైదరాబాద్‌, వరంగల్‌లో మాదిరిగానే ప్రయాణికులు ఆదరించి సంస్థను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా సజ్జన్నార్‌ కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డా.రవీందర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌, ఈడీలు మునిశేఖర్‌, కృష్ణకాంత్‌, పురుషోత్తం, వినోద్‌, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement