Friday, September 22, 2023

నేటి సంపాదకీయం – సంప్రదింపులే శ్రేయస్కరం!

కేంద్రం, రాష్ట్రాల మధ్య సామరస్యం ఉంటేనే ఫెడరల్‌ వ్యవస్థ పరిఢవిల్లుతుందని రాజ్యాంగ నిర్మాతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రాల్లో ప్రభుత్వాలను తరచూ బర్తరఫ్‌ చేయడంపై ప్రతిపక్షాలు ఆందోళన సాగించేవి. ఇప్పుడు రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం పెత్తనాన్నివ్యతిరేకిస్తూ దాదాపు నాలుగు దశాబ్దాల క్రితమే తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీ రామారావు తీవ్రమైన విమర్శలు చేశారు. రాష్ట్రాలు లేనిదే కేంద్రం లేదనీ, కేంద్రం మిధ్య అని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. 1983లో ఏర్పాటైన సర్కారీ కమిషన్‌ చేసిన సిఫార్సుల పుణ్యమా అని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఎడాపెడా బర్తరఫ్‌ చేసే ధోరణి తగ్గింది. కానీ, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పెరిగింది. శాసనాలు చేసేటప్పుడు రాష్ట్రాలను కేంద్రం సంప్రదించడం ఓ ఆనవాయితీ, కేంద్ర ప్రభుత్వం ఆ ఆనవాయితీని పాటించడం లేదని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధానంగా ఈ అంశంపైనే ఇప్పుడు కేంద్రంతో పోరాటం సాగిస్తోంది. అంతవరకూ ఇది బెంగాల్‌కి సంబంధించిన అంశమే. మమతాబెనర్జీ ప్రధానమంత్రిని లక్ష్యంగా పెట్టుకుని విమర్శలు చేయడానికి ఈ అంశాన్ని ఉపయో గించుకుంటున్నారు. ఢిల్లి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌పై తరచూ ఫిర్యాదులు చేస్తూ కేంద్రం తమ ప్రభుత్వంపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ద్వారా తన నిర్ణయాలను రుద్దుతోందని ఆరోపించారు.

అలాగే, కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ కూడా పౌరసత్వ చట్టం సవరణపై కేంద్రం ధోరణిని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ కేడర్‌ అధికారులను కేంద్రం కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోవడం పట్ల వివాదం తలెత్తుతోంది. నిజానికి ఈ రెండు కేడర్‌లు కేంద్రం పరిధిలోనివే కనుక వారి సేవలను వినియోగించుకోవడానికి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకునే అధికారం కేంద్రానికి ఉంది. అయితే, రాష్ట్రాలను సంప్రదించే నియమాన్ని వెనుకటి కేంద్ర ప్రభుత్వం సంప్రదించేది. పీవీ నరసింహా రావు ప్రధానమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పీవీఆర్‌కే ప్రసాద్‌ను తన కార్యదర్శిగా నియమించుకున్నారు. ఇప్పుడు కూడా ఉన్నత పదవుల్లో ఉన్న వారు తమ రాష్ట్రాలకు చెందిన వారిని తమ పేషీల్లోకీలక పదవులకు నియమించడం కొత్త విషయం ఏమీ కాదు. అయితే, ఇటీవల కాలంలో కేంద్రంతో రాజకీయ వైరం పెట్టుకున్న రాష్ట్రాలు దీనిని పెద్ద అంశం చేస్తున్నాయి. దానికి తగినట్టుగానే కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలపై పెత్తనం చేసినట్టుగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు బెంగాల్‌ గవర్నర్‌ ధంకర్‌ ధోరణ నిదర్శనం. ఆయనపై మమతా బెనర్జీ ఇప్పటికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు. చిన్న రేవులపై కేంద్రం అజమాయిషీకోసం గత ఏడాది కేంద్రం తెచ్చిన చట్టసవరణ బిల్లును తమిళనాడు, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా ప్రభుత్వాలు వ్యతిరేకించాయి.

- Advertisement -
   

సాగు చట్టాల సంగతి సరేసరి. ఆ చట్టాలను రాష్ట్రాలే కాకుండా దేశంలోని రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకించాయి. ఏడాది పాటు రైతుల పోరాటం తర్వాత ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. రాష్ట్రా ల్లో పరిస్థితిపై ప్రధానమంత్రికి సరైన సమాచారం అందడం లేదేమోననిపిస్తోంది. లేదా రాష్ట్రాలను తన దారికి తెచ్చుకోవాలనే తాపత్రయం కేంద్రంలో పెరిగినట్టుగా భావించాలి. కేంద్రం రాష్ట్రాలను సంప్రదించేందుకు గతంలో జాతీయాభివృద్ధి మండలి, జాతీయ సమైక్యతా మండలి సమావేశాలను నిర్వహించేవి. ఇప్పుడు అలాంటి సమావేశాలను నిర్వహించడం లేదు. అలాగే, ప్రణాళికాసంఘం స్థానే నీతి ఆయోగ్‌ ఏర్పాటు విషయంలో కూడా తమను సంప్రదించలేదని రాష్ట్రాలు ఆరోపించాయి. రాష్ట్రాలు, కేంద్రం పరస్పరం సమన్వయంతో పని చేసినప్పుడే సమాఖ్య స్ఫూర్తి నిలబడుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కోవిడ్‌ కేసుల గురించి తరచూ సంప్రదింపులు జరుపుతున్న మాటనిజమే కానీ, మిగిలిన విషయాల్లో కూడా రాష్ట్రాల సలహా తీసుకోవడం వాంఛనీయం. చాలా రాష్ట్రాల్లో బీజేపీయే అధికారంలో ఉంది కనుక ఆయన తన మాటను ఎవరూ కాదనరనే దీమాతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. నిధుల విషయంలో కూడా తమ రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని మమతా బెనర్జీయే కాక, బీజేపీయేతర రాష్ట్రాలు ఫిర్యాదు చేస్తున్నాయి. కేంద్ర సర్వీసుల్లో కూడా ప్రతిభావంతులైన అధికారుల సేవలు అవసరం ఉంది కనుక, వారిని వెనక్కి తీసుకుని వెళ్ళడంలో తప్పులేదు కానీ, ముందుగా సంప్రదించడం సంప్రదాయం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement