Thursday, May 2, 2024

అమెరికాలో బియ్యానికి కొరత లేదు.. స్పష్టం చేసిన ట్రేడర్లు

హైదరాబాద్‌ : బియ్యం ఎగుమతులపై ఇండియా నిషేధం విధించడంతో అమెరికాలో ఒక్కసారిగా వాటి ధరలకు రెక్కులు వచ్చాయి. ఎన్‌ఆర్‌ఐలు భారీగా వీటిని కొనుగోలు చేయడంతో స్టాక్‌ లేదన్న బోర్డులు వెలిశాయి. ప్రస్తుతం అమెరికాలో 12 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయని ట్రేడర్లు చెబుతున్నారు. వీటితో పాటు 18వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇంకా రవాణాలో ఉన్నాయని తెలిపారు. ఈ నిల్వలు ఆరు నెలలకు సరిపోతాయని ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ట్రేడర్ల భరోసా ఇస్తున్నారు. భారతీయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటుందన్న విశ్వాసం ఎగుమతిదార్లకు ఉందని హైదరాబాద్‌కు చెందిన డెక్కన్‌ గ్రెయింజ్‌ ఇండియా డైరెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ పోల తెలిపారు.

ఎన్‌ఆర్‌లు సంయమనం పాటించి అందరికి బియ్యం అందేలా ప్రశాంతంగా ఉండాలని ఆయన కోరారు. అనవసరంగా బియ్యం కోసం ఎక్కువ ఖర్చు చేయవద్దని, ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. సాధారణంగా 9 కేజీల బ్యాగ్‌ అమెరికాలో 16-18 డాలర్ల వరకు ఉంటుందని, భయంతోజనం ఎక్కువ మోతాదులో కొనుగోళ్లు చేయడంతో వాటి ధర ఒక్కసారిగా 50 డాలర్లకు చేరిందన్నారు. సాధారణంగా ప్రతి నెల అమెరికాకు మన దేశం నుంచి 6 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతులు అవుతాయన్నారు. ఇందులో ఏపీ, తెలంగాణ నుంచి 4వేల మెట్రిక్‌ టన్నులు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. భారతీయులు ఎక్కువగా వినియోగించే సోనామసూరి బియ్యం ఎగుమతులను కేంద్రం అనుమతించాలని కిరణ్‌ కుమార్‌ కోరారు. మన‌ దేశం నుంచి నెలకు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల బాస్మతీయేతర బియ్యం వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement