Tuesday, May 14, 2024

Ts | 517 అడుగులకు పడిపోయిన సాగర్‌ నీటిమట్టం..

నాగార్జునసాగర్‌ (నందికొండ), ప్రభన్యూస్ : సాగర్‌ నీటిమట్టం పడిపోతోంది. నాగార్జునసాగర్‌ జలాశయం నీటిమట్టం 590 అడుగులు. ఇది 312 టీఎంసీలకు సమానం. కాగా సోమవారం ఉదయం నాటికి సాగర్‌ నీటిమట్టం 516.60 అడుగులుగా ఉంది. ఇది 142.9715 టీఎంసీలకు సమానంగా ఉంది. సాగర్‌ ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటిమట్టం 510 అడుగులు, ఇది 133.00 టీఎంసీలకు సమానం. అంటే నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో నుంచి మరో 8 టీ-ఎంసీల నీటిని మాత్రమే వాడుకునే వీలు ఉంది. సాగర్‌ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌ జంట నగరాలకు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు గ్రామాలకు త్రాగునీరు సరఫరా అవుతోంది. ఇప్పుడున్న నీటి నిల్వలు తాగునీటి అవసరాలకే సరిపోతాయని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.

ఎగువ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం జలాశయంలో 806.00 అడుగుల నీరు మాత్రమే ఉండగా ఇప్పటివరకు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వర్షాలు పడిన ఆనవాళ్లు లేవు. ఆల్మట్టి, నారాయణపూర్‌, తుంగభద్ర లాంటి ప్రాజెక్టులన్నీ వట్టిపోయాయి. ఈ ప్రాజెక్టులన్నీ నిండితేనే దిగువకు నేరు వచ్చి చేరుతుంది. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా సాగు చేపట్టాలని రైతులకు సూచించినా.. నాగార్జునసాగర్‌ జలాశయంలో నీటి నిల్వలు లేకపోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటి విడుదల ప్రతి సంవత్సరం ఆలస్యం అవుతూనే ఉంది. వాస్తవానికి నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు ఏటా జూన్‌ 15వ తేదీ నుంచి ఖరీఫ్‌ పంటకు నీరు ఇవ్వాలని గెజిట్‌లో సైతం ఉంది. కానీ కొన్నేళ్లుగా జులై 15 లేదా ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో నీటి విడుదల జరుగుతుంది.

- Advertisement -

దీనివల్ల ఆయకట్టు ప్రాంతంలో పంటల దిగుబడి తగ్గిపోవడంతో పాటు నీరు ఇస్తారా లేదా అన్న ఆలోచనల్లో అన్నదాతలు కాలం వెళ్లదీస్తున్నారు. కృష్ణా నదికి ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నెలలో వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. నాగార్జునసాగర్‌లో ప్రతి సంవత్సరం 530 అడుగుల వరకు నీటి నిల్వలు ఉండాలని స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రస్తుతాధికారులు దీనిని ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. 530 అడుగుల నీటి నిల్వలు వరదలు వచ్చేంతవరకు ఈ నీటిని ఉపయోగించుకుంటూ తర్వాత వచ్చే వరద నీటితో పంటలు పండించుకోవలనే ఉద్దేశంతో నిబంధనలను పొందుపరిచారు. కానీ పలు కారణాలతో ప్రభుత్వాలు నీటిని అధికంగా వినియోగించుకుంటున్నారు.

దీంతో శ్రీశైలం నాగార్జునసాగర్‌ జలశాయాల్లో కనీస నీటి నిల్వలు లేకుండాపోతున్నాయి. కరీఫ్‌ పంటకు ప్రారంభంలో నీరు అందని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి నెలకొంటున్నా.. ప్రభుత్వం కానీ, అధికారులు కానీ సర్దుబాటు చర్యలు ఎంత మాత్రం చేపట్టడం లేదు. కనీసం ఆగస్టు ఒకటో తేదీలోగా కాలువలకు నీరు ఇవ్వగలిగితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ఒకరు ఆంధ్రప్రభకు తెలిపారు. దీని ద్వారా అధిక దిగుబడి సాధించటంతో పాటు రెండో పంటగా ఆరుతడి పంటలు సాగు చేసుకునే అవకాశాలు అధికంగా ఉంటాయని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement