Wednesday, May 22, 2024

మా పార్టీలో నేతలకు కొదవ లేదు.. పదవులకు డిమాండ్ ఎక్కువ : జగ్గారెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ పీసీసీ కొత్త కార్యవర్గం కూర్పు బావుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, టీపీసీసీ కొత్త కార్యవర్గం జాబితా విడుదల చేసిన వెంటనే స్పందించారు. 84 మందికి ప్రధాన కార్యదర్శులుగా చోటు కల్పించడంతో దాదాపుగా పదవులు ఆశించిన నేతలందరికీ చోటు దక్కిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంకా ఎవరైనా జాబితాలో చోటు దక్కించుకోలేకపోతే, వారికి తదుపరి చోటు కల్పించే అవకాశం ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో నేతలకు కొదవలేదని, అందుకే పదవుల కోసం పోటీ ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని, అందరినీ సంప్రదించిన తర్వాతనే కసరత్తు చేశారని జగ్గారెడ్డి అన్నారు. ఇది ఏఐసీసీ నిర్ణయం, కాబట్టి దీన్ని అందరూ అంగీకరించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త కార్యవర్గంలో అన్ని సామాజికవర్గాలకు చోటు కల్పించి సామాజిక సమతుల్యత పాటించినట్టుగానే కనిపిస్తోందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీని సముద్రంతో పోల్చుతో తమ దగ్గర నేతలు చాలా మంది ఉన్నారని, నదులు, పిల్లకాలవల్లాంటి టీఆర్ఎస్, బీజేపీల్లో నేతలు లేక తమ పార్టీ నేతలను లాక్కునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు. ఇకపోతే ఈ కమిటీ ప్రకటన సరైన సమయంలోనే జరిగిందని, ఏడాది వ్యవద్ధిలో ఎన్నికలను ఎదుర్కొంటామని అన్నారు. కమిటీలో ఇంకా ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలనుకుంటే టీమ్ అంతా కూర్చుని మాట్లాడుకుంటామని తెలిపారు. సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏ పదవీ అప్పగించకపోవడంపై ప్రశ్నించగా.. ఆ వ్యవహారం టీపీసీసీ పరిధిలో లేదని, ఏఐసీసీ స్థాయిలోనే వెంకటరెడ్డి గురించి నిర్ణయం తీసుకుంటారని జగ్గారెడ్డి తెలిపారు.

- Advertisement -

మాతోనే పోటీ

బీజేపీతోనే తమకు పోటీ అని టీఆర్ఎస్ నేతలు అనుకుంటే సరిపోదని జగ్గారెడ్డి అన్నారు. ఉపఎన్నికల ఫలితాలను చూసి కంగ్రెస్ పనైపోయిందని అనుకోవద్దని, ఉపఎన్నికల్లో సహజంగానే అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలత ఉంటుందని అన్నారు. పైగా టీఆర్ఎస్, బీజేపీలు ఓటర్ల వెంటపడి మరీ డబ్బులిచ్చి ఓట్లేయించుకునేందుకు ప్రయత్నించాయని ఆయన విమర్శించారు. సాధారణ ఎన్నికల్లో ఈ డబ్బు ప్రభావం అంతగా ఉండదని, ప్రజలు అన్నీ గమనించి ఓటేస్తారని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంత చంకలు గుద్దుకున్నా ఎన్నికల్లో ఆ పార్టీ మూడవ స్థానంలో లేదా 4వ స్థానంలో ఉండాల్సిందేనని జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసలైన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్యనే ఉంటుందని ఆయన సూత్రీకరించారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి అంటూ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి దేశమంతటా విస్తరించే ప్రయత్నాలపై స్పందిస్తూ.. తెలంగాణ మోడల్ అభివృద్ధి ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసని, దేశంలో మిగతా రాష్ట్రాల ప్రజలకు తెలియదు కాబట్టి కేసీఆర్ కొత్త నాటకం మొదలుపెట్టారని జగ్గారెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఎన్ని గ్రామాలకు తాగునీరు, ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారో స్పష్టత లేదని విమర్శించారు.

మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారా లేక ఊరికే ప్రశ్నించి వదిలేస్తారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు నాటకాలాడుతున్నాయని ఆయన ఆరోపించారు. కవితను అరెస్ట్ చేస్తేనే బీజేపీది నాటకం కాదని స్పష్టమవుతుందని అన్నారు. ఈ రెండు పార్టీల డ్రామా రాజకీయాలపై తాము కమిటీలో చర్చించుకుని ప్రతివ్యూహాలతో ముందుకెళ్తామని జగ్గారెడ్డి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement