Wednesday, May 15, 2024

Delhi | ముందుస్తు ప్రసక్తే లేదు.. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : కారుమూరి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్లవలసిన అవసరం తమకు లేదని, ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ బుధవారం కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులతో జరిగిన సమావేశంలో పాల్గొని చిరుధాన్యాలు, బియ్యం పంపిణీపై పలు సూచనలు చేశానని వెల్లడించారు. రాష్ట్రంలో రాగుల పంటను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

రాగులు క్వింటాకు రూ. 3846 రూ కనీస మద్దతు ధరగా ఇస్తున్నామని, అలాగే రేషన్‌లో గోధుమ పిండిని ప్రతి గ్రామనికి ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పౌర సరఫరాల విభాగాన్ని దివాలా తీసేలా చేసిందని మంత్రి ఆరోపించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ శాఖను గాడిన పెట్టిందని, క్రమపద్దతిలో జరుగుతున్న ధాన్యం సేకరణతో రైతులు సంతోషంగా ఉన్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు గత ప్రభుత్వం కంటే కందిపప్పు, చక్కెర రెట్టింపు ఇస్తున్నామని… బియ్యం, గోధుమపిండి, చక్కెర, రాగులు ఒక కిట్‌లా అందజేస్తున్నామని చెప్పారు.

ఇప్పటివరకు రేషన్ కార్డుల విషయంలో పాత లెక్కలనే కేంద్రం పరిగణనలోకి తీసుకుంటోందని, ఇకపై నూతన జనాభా లెక్కల ఆధారంగా చర్యలు తీసుకుంటామని పీయూష్ గోయల్ హామీ ఇచ్చారని నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 80 లక్షల మందికి రేషన్ ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 50 లక్షలకు పైగా కుటుంబాలకు ఉచితంగా రేషన్ అందజేస్తోందని, దీనికయ్యే ఖర్చును తామే భరిస్తున్నామని వివరించారు. ఏపీ పౌరసరఫరాల శాఖకు సుదీర్ఘకాలంగా (2012-13 నుంచి రూ. 2017-18 వరకూ) పెండింగులో ఉన్న బియ్యం సబ్సిడీ బకాయిలు రూ.1,702.90 కోట్ల చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని వెల్లడించారు.

- Advertisement -

ముందస్తు మాట విడ్డూరం

అనంతరం నాగేశ్వరరావు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడమనేది విడ్డూరంగా ఉందని విస్మయం వ్యక్తం చేశారు. తమకు ముందస్తు అవసరమే లేదన్న ఆయన, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి సింగిల్‌గా వస్తారని, ఎన్ని పార్టీలు కలిసి పోరాడినా వైఎస్సార్సీపీ మాత్రం ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తారని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ఢిల్లీ వచ్చి రాష్ట్రానికి కావలసినవి సాధించుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనమే తప్ప తమకు మరేదీ ముఖ్యం కాదన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమించడం వల్ల తమకు మంచే జరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

ఈసారి ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ స్థానాలనే తమ పార్టీ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఇంటితో అనుబంధం పెనవేసుకున్న సీఎంగా జగన్‌ను ప్రజలు ప్రేమిస్తున్నారని మంత్రి తెలిపారు. పప్పు బెల్లంలా పథకాల పేరుతో పంపకాలు చేస్తారా… రాష్ట్రం శ్రీలంకలా మారుతుందని చంద్రబాబు విమర్శించారని, ఇప్పుడు ఏపీ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని వివరించారు. ప్యాకేజీ కాదు ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని అడుగుతున్నామని నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. కేంద్రం ప్రత్యేక హోదా లేదన్నా తాము అడుగుతూనే ఉంటామని అన్నారు. ప్రత్యేక హోదా ఏ విధంగా సాధించుకోవాలో జగన్మోహన్ రెడ్డికి తెలుసునని ఆయన చెప్పారు.

బియ్యం దుకాణం మూసివేత

విలేకరుల సమావేశం అనంతరం మంత్రి, నాణ్యతా లోపం, అధిక ధరలపై ఫిర్యాదులు అందడంతో ఆంధ్రప్రదేశ్ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరాల సంస్థ సౌజన్యంతో నడిచే బియ్యం దుకాణాన్ని పరిశీలించారు. షాపులోని సరుకును తనిఖీ చేశారు. కల్తీ బియ్యం, పురుగులు పట్టిన రాగి పిండిని చూసి మంత్రి విస్తుపోయారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తెరవవద్దని సిబ్బందికి చెప్పి దుకాణాన్ని మూసివేయించారు. ఏపీ భవన్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిత్యవసరాల దుకాణాన్ని నడిపిస్తామని, భవన్ ఉద్యోగిని ఇక్కడ నియమిస్తామని నాగేశ్వరరావు వెల్లడించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement