Monday, May 13, 2024

ప్రపంచంలోనే అతి చిన్న పోలీస్‌స్టేషన్‌.. అక్క‌డ ఉండేది ముగ్గురు పోలీసులే

పోలీస్‌ స్టేషన్‌ అంటే పెద్ద భవనం… హంగు… ఆర్భాటం… పోలీసులు… నేరస్తులు… ఇలా ఎంతో హడావుడిగా వుంటుంది. అదీగాక అగ్రరాజ్యంలో వున్న పోలీస్‌స్టేషన్లు అంటే ఎంత పెద్ద భవనంలో వుండాలి కదా! కానీ ప్రపంచంలోనే అతిచిన్న పోలీస్‌స్టేషన్‌ అగ్రరాజ్యం అమెరికాలో వుంది అంటే ఆశ్చర్యంగా వుంది కదా! ఇది కథకాదు… నిజంగా నిజం. ఈ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటైన విధానం చూస్తే ఓ సినిమాలో జరిగినట్టుగా వుంది. అమెరికాలోని ఫ్లోరిడా సమీపంలోని కారాబెల్లె నగరంలో ప్రపంచంలోనే అతిచిన్న పోలీస్‌స్టేషన్‌ ఉంది. ఇది టెలిఫోన్‌ బూత్‌ పరిమాణంలో ఉంటుంది. 1963లో కారాబెల్‌ పట్టణంలోని 93వ జాతీయ రహదారిపై పోలీసులకు చెందిన ఫోన్‌ను సమీపంలోని భవనం గోడకు బెర్రీ చెట్టు నీడలో అమర్చారు. డ్యూటీలో వున్న ఓ పోలీసు బీట్‌ ఆఫీసర్‌ ఆ ఫోన్‌ని ఉపయోగించేవాడు. ఫోన్‌ రోడ్డు పక్కన ఉండడంతో పోలీసు అధికారి లేని సమయంలో స్థానికంగా వున్న అల్లరి పిల్లలు ఆ ఫోన్‌ నుంచి అత్యధికంగా ఫోన్లు చేసేవారు. పోలీసు అధికారికి అది సమస్యగా మారింది. అంతేకాకుండా వర్షం పడిన ప్రతిసారీ రోడ్డుపక్కన నిలబడి ఫోన్లో మాట్లాడే వ్యక్తి తడిసిపోయేవాడు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఆయన ఒక్కరే పోలీసు అధికారిగా వుండేవాడు. అందుకే చిన్నపాటి టెలిఫోన్‌ బూత్‌ ఏర్పాటుచేసి అందులో ఫోన్‌ ఉంచారు. పోలీసు అధికారి అక్కడే కూర్చోవడంతో అదే పోలీస్‌స్టేషన్‌గా మారింది.

ఇప్పుడు ఈ పోలీస్‌స్టేషన్లో ముగ్గురు పోలీసులు వున్నారు. 1990ల ప్రారంభంలో ఒక ఇంటర్వ్యూలో పోలీస్‌ చీఫ్‌ జెస్సీ స్మిత్‌ మాట్లాడుతూ, ”ఈ స్టేషన్‌లో 22 సంవత్సరాలు పనిచేసాను. నేను దీనిని ప్రేమిస్తున్నాను.” అన్నారుట. ప్రపంచంలోనే అతిచిన్న పోలీసు స్టేషన్‌గా గుర్తింపు పొందిన దీన్ని చూడటానికి వేలాదిమంది సందర్శకులు వస్తారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సందర్శకులకు వీక్షించే అవకాశం కల్పించారు. నగరాన్ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు ఇప్పటికీ ఈ చిన్న పోలీస్‌స్టేఫన్‌ను చూసి మురిసిపోతున్నారు. దీని నమూనాతోపాటు గతంలో పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుచేసిన స్థలంలో బెంచ్‌ కూడా ఏర్పాటుచేశారు. పర్యాటకులు ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటారు. వాటిని వారి సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ చిన్న పోలీస్‌స్టేషన్‌ కొన్ని టెలివిజన్‌ షోలలో, సినిమాలలో కూడా చూపబడింది. పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికీ ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ ఉంది. కొంతకాలం క్రితం వరకు దీని నుంచే సందర్శకులు కాల్స్‌ చేసేవారు. కానీ ప్రస్తుతం ఔట్‌గోయింగ్‌ సౌకర్యం లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement