Wednesday, May 15, 2024

Big Story : భారత రైతు ఉద్యమానికి కేసీఆర్‌ రెడీ.. రైతునేతలతో త్వరలో వర్క్‌ షాప్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : మునుగోడు విజయంతో ఉత్సాహంగా ఉన్న గులాబీదళపతి కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ రోడ్‌ మ్యాప్‌ను నేషనల్‌ హైవేపైకి ఎక్కిస్తున్నారు. రైతుబంధుగా అనేక పథకాలు ప్రవేశపెట్టి, ప్రాజెక్టులు నిర్మించి ముద్రవేసుకున్న కేసీఆర్‌ దేశవ్యాప్తంగా రైతాంగంలో భరోసా నింపేలా, ఆశలు కల్పించేలా భారీ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ను భారత్‌ రాష్ట్రసమితిగా మారుస్తున్నామని, అభ్యంతరాలున్నవారు నెలరోజుల్లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పాలంటూ.. సోమవారం పార్టీ తరుపున పత్రికా ప్రకటన ఇచ్చారు. నెలరోజుల్లో ఎన్నికల సంఘం క్లియరెన్స్‌ వస్తుందని, డిసెంబర్‌లో ఢిల్లి వేదికగా బీఆర్‌ఎస్‌ అజెండా ప్రకటించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

మహారాష్ట్ర, కర్ణాటకలపై ఫోకస్‌

మహారాష్ట్ర, కర్ణాటకలపై మొదటి ఫోకస్‌ పెట్టాలని కేసీఆర్‌ డిసైడ్‌ అయ్యారు. తెలంగాణ పథకాలపై ఈ రెండు రాష్ట్రాలలో అత్యంత ఆకర్షణ ఉండగా, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, దళితబంధు వంటి అనేక పథకాలు ఇక్కడి ప్రజల్లో కేసీఆర్‌ పట్ల ఎంతో ఆకర్షణను పెంచాయని పలు నివేదికలు అందాయి. బీఆర్‌ఎస్‌ పై ఆయా రాష్ట్రాలలో నిర్వహించిన సర్వేలలోనూ మంచి స్పందన కనిపించింది. వీటికి తోడు మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు అధికం. రైతు ఉద్యమాలు నిరంతరం జరుగుతుంటాయి. కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి. బాబ్లి, ఆల్మట్టి వంటి వివాదాలు.. ఆయా రాష్ట్రాలతో ఉన్నా తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎంతో సంయమనంతో వ్యవహరిస్తూ అక్కడి ప్రజల మనసులు గెలుచుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అక్కడి ప్రభుత్వాన్ని ఒప్పించి, ప్రారంభోత్సవానికి ఆ రాష్ట్ర సీఎంను కూడా ఆహ్వానించింది.

కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలలో తెలంగాణ పథకాలు మెరుస్తూనే ఉన్నాయి. అక్కడి, ప్రజలు నేతలు తరచూ తెలంగాణ మోడల్‌ను ప్రస్తావిస్తుంటారు. మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్న రైతు సమస్యలను కేంద్రంగా చేసుకుని విస్తృత కార్యాచరణకు దిగాలని కేసీఆర్‌ డిసైడయ్యారు. త్వరలో హైదరాబాద్‌ లేదా కరీంనగర్‌లో భారత్‌ రాష్ట్ర కిసాన్‌ సమితి వర్క్‌ షాపును కూడా ఏర్పాటుచేయాలని సీఎం భావిస్తున్నారు. ఈ నెలాఖరులో లేదా డిసెంబర్‌లో ఈ సదస్సు తెలంగాణలోనే నిర్వహించనున్నారు. దళిత మేధావులతో భారీ కాంక్లేవ్‌ను కూడా హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. దేశంలోని దళిత మేధావులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, రిటైర్డ్‌ హైకోర్టు జడ్జిలతో దీనిని పెద్ద ఎత్తున నిర్వహించే యోచనలో ఉన్నారు.

జిల్లాలకు కేసీఆర్‌

- Advertisement -

త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. మునుగోడు ప్రచారంలో తల మునకలై తమ నియోజకవర్గాలకు దూరమైన ఎమ్మెల్యేలను ఇక తాను పిలిస్తే తప్ప హైదరాబాద్‌ రావొద్దని సీఎం ఆదేశించారు. నియోజకవర్గాలనే క్షేత్రంగా చేసుకుని ఎమ్మెల్యేలంతా పనిచేయాలని, ప్రజలతోనే ఉండాలని.. ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని సీఎం ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రజల సేవలో పునరంకితమై, ప్రజల మధ్యనే ఉండాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పర్యటించాలని సీఎం భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement