Monday, May 6, 2024

ప్రధాని పర్యటనను తాకనున్న నిరసన సెగలు.. ఈనెల 12న రాజ్‌ భవన్‌ ముట్టడికి యత్నం!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కేంద్రప్రభుత్వం గవర్నర్లను ఏజెంట్లుగా మార్చుకుని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఈనెల 12న ప్రధాని పర్యటన సందర్భంగా రాజ్‌ భవన్‌ను ముట్టడించనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌,సీపీఐ లతో కలిసి ఈ కార్యాక్రమం నిర్వహించడంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధానిమోడీ విధానాలను తమ్మినేని వీరభద్రం తూర్పారబట్టారు.రాజగోపాల్‌ రెడ్డి, బీజేపీ స్వార్థప్రయోజనాల కోసం మునుగోడు ఎన్నిలు వస్తే ప్రజలు బీజేపీకి తగినగుణపాఠం నేర్పి టీఆర్‌ఎస్‌ ను ప్రజలుగెలిపించారని చెప్పారు. కుట్రపూరితమైన బీజేపీ రాజకీయాలను టీఆర్‌ఎస్‌ తో కలిసి ఎండగట్టామని తమ్మినేని వీరభద్రం చెప్పారు.

టీఆర్‌ఎస్‌ కు ప్రత్యామ్నాయం బీజేపీ అంటూ బండిసంజయ్‌ చేసిన వ్యాఖ్యానాలను తప్పుబట్టారు. రాష్ట్రంలో బీజేపీ లేనప్పుడు ప్రత్యామ్నాయం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ కుట్రల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ గడ్డ, అభ్యుదయ భావాలకు నిలయమన్నారు. తెలంగాణలో మతోన్మాద భావజాలాన్ని ప్రజలు అంగీకరించరని గుర్తు చేశారు. కేంద్రం ఈడీ,సీబీఐతో బెదిరించి ఎంఎల్‌ఏలను కొనగోలు చేసే ప్రయత్నాలను ప్రజలుచిత్తు చేశారన్నారు. మునుగోడులో కమ్యూనిస్టుల ఐక్యతతోనే టీఆర్‌ఎస్‌ విజయం సాధ్యమైందన్నారు. ఈ గెలుపుతో కమ్యూనిస్టులు గర్వంగా ఉన్నారన్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలుపుకే పరిమితం కాకుండా పోడుభూములకు పట్టాలివ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

పోడుభూముల ఆక్రమణలో ఉన్నప్రతి సాగుదారుకు పట్టాలివ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. రౖౖెతులు, భూనిర్వాసితులు, ఆర్టీసీ కార్మికులు,కాంట్రాక్టు లెక్చరర్లసమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పారు. బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రజాసమస్యలతతో పాటుగా ప్రజా ఉద్యమాలను నిర్మించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈనెల 12న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ప్రధాని వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఇందులో భాగంగా గవర్నర్ల వ్యవస్థను కేంద్రం ఏజెంట్ల వ్యవస్థగా మార్చినందుకు నిరసిస్తూ రాజ్‌ భవన్‌ ను టీఆర్‌ఎస్‌ తో కలిసి ముట్టడించనున్నట్లు వివరించారు. కేరళ గవర్నర్‌ అరీఫ్‌ఖాన్‌ మంత్రులను తొలగించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా జాతీయ ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి, సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లాకార్యదర్శి ఎండీ జహంగీర్‌ మాట్లాడుతూ బీజేపీ విధానాలను తప్పుబట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement