Saturday, July 27, 2024

AP: మల్టీస్టారర్ కూటమి ప్రభుత్వం ఖాయం.. బుద్ధా వెంకన్న

అమరావతి సాక్షిగా బాబు ప్రమాణ స్వీకారం..
రాష్ట్ర అభివృద్ధి కోసం తరలివచ్చిన ఓటర్లు..

(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారధ్యంలో మల్టీస్టార్ మహా కూటమి ఏపీలో సూపర్ డూపర్ హిట్ అయిందని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. ఏపీలో కూటమి 130 సీట్లకు పైగా సాధించబోతుందని తెలిపారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఆయన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుద్ధ వెంకన్న మాట్లాడుతూ… 2019లో జగన్ ను గెలిపించేందుకు బారులు తీరిన ప్రజలు ఐదేళ్లు ఇబ్బందులు పడ్డారన్నారు. జ‌గ‌న్ గురించి ప్రజలు తెలుసుకుని ఈసారి ఓడించాలని కంకణం కట్టుకున్నారన్నారు. జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు సాగనంపేలా కూటమికి ఓట్లు వేశారన్నారు. జగన్ కు ఇచ్చిన అవకాశం దుర్వినియోగం చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టారని తెలిపారు. 2019లో 79శాతం పోలైతే ప్ర‌స్తుతం 81శాతం పోలింగ్ జరిగిందన్నారు. చంద్రబాబు నాలుగుసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమ‌న్నారు.

ఐదేళ్లల్లో అవకతకవకలకు పాల్పడిన వారు ఫైళ్లు కూడా మాయం చేసేలా కుట్రలు చేస్తున్నారని, చంద్రబాబు, పవన్, మోడీ సారధ్యంలో ఏపీ అభివృద్ది అవుతుందని ప్రజలు ఓట్లు వేశారన్నారు. చంద్రబాబు వంటి నాయకుడిని అన్యాయంగా జైల్లో పెట్టారని కక్షతో ప్రజలు జగన్ ను ఓడించాలని ఓట్లు వేశారన్నారు. సైకిల్ పై పడిన ప్రతి ఓటు చంద్రబాబును చూసి ప్రజలు వేశారనీ తెలిపారు. అభ్యర్దులను చూసి కాదు… చంద్రబాబు మళ్లీ రావాలని ఓట్లు వేశారన్నారు. రాక్షస పాలన అంతం చేసేందుకు భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా ప్రజల్లోకి వచ్చారన్నారు. జగన్ కు 151 సీట్లు వచ్చినప్పుడు టీడీపీ పని అయిపోందన్నారని, కానీ చంద్రబాబు పట్టుదలతో రాష్ట్రం, ప్రజల కోసం నిలబడ్డారని గుర్తు చేశారు. నేడు మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో అధికారాన్ని అందుకుంటున్నారని చెప్పారు.

- Advertisement -

నారా కుటుంబంలో ఉన్న నలుగురు చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి నాలుగు దిక్కులుగా మారి ప్రచారం చేశారన్నారు. చంద్రబాబును జైలుకు పంపిన ఘటనతో రాష్ట్ర ప్రజలు మొత్తం బాధ పడ్డారన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అక్రమ అరెస్టుపై స్పందించి చంద్రబాబుకు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఒక దొంగను తరిమి కొట్టేందుకు నిజాయతీ పరులు అందరూ ఒక్క‌టయ్యారని చెప్పారు. భేషరతుగా మద్దతు పలికి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు చెప్పారు. ఓటమి విషయం తెలిసి కూడా బొత్స సత్యనారాయణ మేకబోతు గాంభీర్యం పోతున్నారన్నారు.

మహా కూటమికి 130కి పైగా సీట్లు వస్తాయి.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తారని తెలిపారు. కోటికొక్కడు అనే పదానికి అక్షర సత్యం నారా చంద్రబాబునాయుడుగా అభివర్ణించారు. అటువంటి వ్యక్తి పాలనలో ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. ప్రజలతో పాటు, ఉద్యోగస్తులు కూడా మహా కూటమికే ఓట్లు వేశారన్నారు. జగన్ ఎవరినీ వదలకుండా ఇబ్బందులు పెట్టారు. అందుకే సమయం చూశారు.. సాగనంపుతున్నారన్నారు. జగన్ ను ఓడించడానికే ఇతర రాష్ట్రాలు, దేశాల్లో స్థిరపడిన తెలుగు వారంతా తరలి వచ్చారనీ, మన రాష్ట్రం, మన ప్రాంతం అభివృద్ది చెందాలనే ఆరాటంతో వారంతా ఏపీకి తరలి వచ్చారని గుర్తు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి 40వేల ఓట్లతో గెలుస్తున్నారనీ, జూన్ 4న వెలువడే ఫలితాలు చూశాక మరింత ఆశ్చర్యపోతారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement