Saturday, May 4, 2024

Big Story : వైద్య విద్యలో విప్లవం.. వైద్య విద్యా హబ్‌గా తెలంగాణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వ కృషితో తెలంగాణ రాష్ట్రం వైద్య విద్య హబ్‌గా మారుతోంది. వైద్య విద్యలో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. ప్రత్యేక రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం 2022-23లోనే కొత్తగా 8 మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 15న కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రారంభించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక గడిచిన ఎనిమిదేళ్లలో 12 కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను రాష్ట్రంలో ఏర్పాటు చేశారు.

జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా ఇప్పటికే 16 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇప్పటి వరకు ఒక్క మెడికల్‌ కాలేజీని మంజూరు చేయకున్నా సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తోంది. ఒక్కో కొత్త మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు రూ.550 కోట్లు అవసరం కానున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో 7 దశాబ్దాల కాలంలో తెలంగాణ అంతటా కేవలం 5 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఈ నెల 15న ప్రారంభించబోయే కొత్త మెడికల్‌ కాలేజీల్లొ ఆదివాసీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కానుంది. కొత్తగా ప్రారంభమయ్యే ఎనిమిది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలతో అదనంగా ఈ ఒక్క విద్యా సంవత్సరంలోనే 1200 ఎంబీబీఎస్‌ సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ 8 కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ప్రారంభం కానున్నాయి.

తెలంగాణ ఏర్పడే నాటికి ఈ ప్రాంతంలో కేవలం 850 ఎంబీబీఎ స్‌ సీట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ కృషితో 2902 ప్రభుత్వ ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విద్యా సంవత్సరం 2022-23 లో ప్రారంభమయ్యే కొత్త ఎనిమిది మెడికల్‌ కాలేజీలను కలుపుకుంటే ప్రభుత్వ, ప్రయివేటు మెడికల్‌ కాలేజీల్లో కలిపి 6540 కన్వీనర్‌ కోటా ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

కొత్తగా జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న మెడికల్‌ కాలేజీలతో అక్కడి పేద, సామాన్య ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి రానుంది. మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా 300 పడకలతో కూడిన జిల్లా ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందడంతోపాటు వైద్యుల కొరత తీరుతుంది. దాదాపు 18 విభాగాల్లో మెరుగైన వైద్యం తమ గ్రామాల చెంతనే పేదలకు అందుబాటులోకి రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement