Tuesday, July 23, 2024

Exclusive – అక్క‌డే..ఫోక‌స్‌!… ఆ నాలుగింటిపైనే జ‌నం ఆస‌క్తి


ఒవైసీ వ‌ర్సెస్ మాధ‌విల‌త‌
రాహుల్‌కు పోటీగా అన్నీ రాజా
అన్నామ‌లై గెలుపు ఖాయ‌మేనా?
పెద్ద ఎత్తున కొన‌సాగుతున్న బెట్టింగ్స్‌
హైద‌రాబాద్‌, కొయంబ‌త్తూర్‌, వ‌య‌నాడ్‌, రాయ్‌బ‌రేలి
ఈ నాలుగు స్థానాల‌పై జ‌నాల పిచ్చ ఇంట్రెస్ట్‌
అన‌లిస్టుల అంచ‌నాల‌కు అంద‌ని పోలింగ్ తీరు
ముస్లిం మ‌హిళ‌ల‌తో మాధ‌విల‌త అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌
పాత‌బ‌స్తీలో బీజేపీ అభ్య‌ర్థి తీరుపై వీడియో వైర‌ల్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, స్పెష‌ల్ డెస్క్‌: అవును దేశ వ్యాప్తంగా 543 లోక్​సభ స్థానాల‌కు ఎన్నిక‌లు జరిగాయి. ఇప్ప‌టికే నాలుగు విడ‌త‌ల్లో 379 స్థానాల‌కు ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్త‌య్యింది. మ‌రో 3 విడ‌త‌ల్లో మిగిలిన స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి. కాగా, ఈ నెల 13న దేశ వ్యాప్తంగా జరిగిన నాలుగో విడ‌తలో 96 లోక్​స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జరిగాయి. ఇందులో హైద‌రాబాద్ లోక్‌స‌భ స్థానం అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఈ స్థానం అంద‌రిని తనవైపు చూపు తిప్పుకునేలా చేసింది.

- Advertisement -

రాహుల్ పోటీ చేసే రెండూ కీల‌క‌మే..

కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ పోటీ చేసిన వాయ‌నాడ్, రాయ‌బ‌రేలితో పాటు బీజేపీ అభ్యర్థి పోటీ చేసిన త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూర్ స్థానాల‌పై కూడా అంద‌రి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇప్ప‌టికే కోయంబ‌త్తూర్​లో మొద‌టి విడ‌త ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇక్క‌డి నుంచి బీజేపీ త‌మిళనాడు అధ్య‌క్షుడు అన్నామ‌లై పోటీ చేశారు. ఆయ‌న గెలుపుపై బెట్టింగ్స్ పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. అటు వాయినాడ్ నుంచి రెండో విడ‌త‌లో భాగంగా కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ పోటీ చేశారు. ఇక్క‌డ ఆయ‌న‌కు ప్ర‌త్య‌ర్థులుగా సీపీఐ నుంచి అన్నీ రాజాతో పాటు బీజేపీ ఆ రాష్ట్ర అధ్య‌క్షుడు సురేంద్ర‌న్ గ‌ట్టి పోటీ ఇచ్చారు. ఈ స్థానంపై కూడా దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

మ‌రోవైపు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న మ‌రో స్థానం ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని రాయ‌బ‌రేలి. గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు పోటీ చేసిన అమేథీ నుంచి కాకుండా.. త‌న త‌ల్లి, నాయ‌న‌మ్మ‌, తాత‌ ప్రాతినిథ్యం వ‌హించిన రాయ‌బ‌రేలిని రాహుల్​ ఎంచుకోవ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. అటు రాహుల్ రాయ‌బ‌రేలితో పాటు వాయ‌నాడ్ నుంచి గెలిస్తే ఏ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఉంచుకుంటానేది హాట్ టాపిక్‌గా మారింది.

అలా అయితే.. ప్రియాంక బరిలో దిగేనా

ఒక‌వేళ రాహుల్​ గాంధీ రెండు చోట్ల గెలిస్తే.. రాయ‌బ‌రేలికి రాజీనామా చేసి త‌న చెల్లెలు ప్రియాంక వాద్రాను బ‌రిలో దింపాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు 2014 వ‌ర‌కు త‌న‌కు కంచుకోట‌గా ఉన్న అమేథీ బ‌రిలో త‌న కుటుంబానికి స‌న్నిహితుడైన శ‌ర్మ‌ను బ‌రిలో దించారు. అక్క‌డ బీజేపీ త‌రుపున స్మృతి ఇరానీ రెండోసారి ఈ స్థానం గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో పనిచేస్తున్నారు. ఇక ఇక్కడ ఫ‌లితం ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.

ట‌ఫ్ ఫైట్ ఇచ్చిన మాధ‌వీల‌త‌..

ఈ మూడు లోక్​స‌భ సీట్ల‌తో పాటు హైద‌రాబాద్ లోక్​స‌భ స్థానంపై దేశ వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొనేలా చేశారు బీజేపీ అభ్య‌ర్థి కొంపెల్ల మాధ‌వీల‌త‌. త‌న ప్రచారంతో ఒవైసీకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. ఎన్న‌డూ గుడిముఖం చూడ‌ని ఒవైసీని గుళ్ల వైపు ప‌రిగెత్తాలా చేశార‌నే ప్ర‌చారం ఉంది. అయితే.. బీజేపీ అధిష్ఠానం మాధ‌వీల‌త‌ను దించ‌డం వెన‌క పెద్ద గ్రౌండ్ వ‌ర్క్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆమె అప్ప‌టికే త‌న లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నో కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల్లో వెళ్లారు. అయితే.. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మొత్తంగా ఒవైసీకి కోట‌కు బీట‌లు వారేలా చేస్తారా అనే అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. అంతేకాకుండా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలిచినా.. ట‌ఫ్ ఫైట్‌లో త‌క్కువ మార్జిన్‌తో బ‌య‌ట‌ప‌డ‌తార‌నేది రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

పెద్ద మొత్తంలో న‌కిలీ ఓట్ల తొల‌గింపు..

ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌స‌భ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 5 లక్షల బోగస్ ఓట్లు తొలిగించారు. ఇలా తొలిగించిన ఓట్లలో అత్యధిక శాతం మజ్లిస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉండటంతో రాబోయే ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ నేతల్లో కలకలం నెల‌కొంది.. హైద‌రాబాద్ ప‌రిధిలో దాదాపు ఇంత పెద్ద మొత్తంలో న‌కిలీ ఓట్ల‌ను తొలిగించ‌డం అనేది ఓ రికార్డు అనే చెప్పాలి. త‌న లోక్‌స‌భ ప‌రిధిలో ఇన్ని ల‌క్ష‌ల బోగ‌స్ ఓట్ల‌ను తొలిగించినా ఒవైసీ కిక్కురుమ‌న‌కుండా ఉండ‌టం వెన‌క ఆయ‌న ఓట‌మి భ‌యాన్ని సూచిస్తోంద‌నే వాద‌న కూడా ఉంది.

పాత‌బ‌స్తీలో ఫుల్ రెస్పాన్స్‌..

మ‌రోవైపు మాధ‌వీల‌త ప్ర‌చారానికి ఊహించిన రేంజ్‌లో పాత‌బ‌స్తీ లాల్ ద‌ర్వాజా, సుధా టాకీస్ ప్రాంతాల్లో రెస్పాన్స్ రావ‌డం ఆమెకు మాంచి బూస్ట్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఓల్డ్ సిటీలో లాల్ ద‌ర్వాజా,సుధా టాకీస్, రాజ‌న్న బావి, హ‌రిబౌలి, గౌలిపురా, ఛ‌త్రినాక‌, దూద్ బౌలి, మ‌ల‌క్ పేట‌, మాద‌న్న పేట‌, ఉప్పుగూడ జియా గూడ, మంగ‌ళ్ హాట్ వంటి ప్రాంతాల్లో హిందూ ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్నారు. ఈ సారి ఈ ఓట్ల‌న్నీ గంప‌గుత్త‌గా మాధ‌వీల‌త‌కు ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.

అసాధ్యమేమీ కాక‌పోవ‌చ్చు..

ముఖ్యంగా పాత‌బ‌స్తీలో ఎక్కువ మంది చిరు ఉద్యోగులు మాధ‌వీ ల‌త ప్ర‌సంగాలు విన‌డానికి సెల‌వులు పెట్టి మ‌రి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా ఒవైసీని భ‌య‌పెట్టే సివంగి వ‌చ్చింద‌ని అంద‌రూ చెప్పుకున్నారు. ఇక‌.. హైద‌రాబాద్ లోక్‌స‌భ‌ ప‌రిధిలో ఉత్త‌ర ప్ర‌దేశ్ త‌ర‌హా పోల్ మేనేజ్‌మెంట్ జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు స‌మాచారం. ఏది ఏమైనా న‌కిలీ ఓట్లు తొలిగింపుతో పాటు 2 శాతం అటు వైపు ఓట్లు ప‌డినా.. మాధ‌వీ ల‌తా హైద‌రాబాద్ స్థానంలో సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయం అని అన‌లిస్టులు అంచ‌నా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement