Saturday, April 27, 2024

కాన్పుకోసం సైకిల్ పై వెళ్లిన ఎంపీ!

న్యూజిలాండ్: కీలకమైన రాజకీయ పదవుల్లో ఉన్నప్పటికీ, న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డర్న్ బాటలోనే నిరాడంబరత చాటుకున్నారు ఆ దేశ మహిళా ఎంపీ ఒకరు. మాతృత్వానికి, పిల్లల పెంపకానికి విలువ ఇస్తూనే కర్తవ్య నిర్వహణలో నిర్లక్ష్యం చూపకుండా ఆ దేశ ప్రధాని జసిండా వ్యవహరించిన తీరు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరచింది. మెటర్నిటీ లీవ్ పెట్టిన జసిండా ప్రసవం తరువాత విధులకు హాజరయ్యారు. చిన్నారికి చనుబాలు ఇస్తూ సాకుతున్నారు. అదీగాక ఈమధ్య నిర్వహించిన ఐక్యరాజ్యసమితి సమావేశాలకు తన మూడునెలల పసికందును వెంటబెట్టుకుని వెళ్లి మధ్యలో చనుబాలు ఇచ్చారు. కూడా ఇప్పుడు న్యూజిలాండ్ మహిళా ఎంపీ జూలీ అన్నే జెంటర్ అదే బాటలో వెళ్లారు.

నెలలు నిండి ఇక కొద్ది గంటల్లో కాన్పువచ్చే సూచనలు కన్పించడంతో ఆమె సైకిల్ పై ఆస్పత్రికి బయలుదేరి వెళ్లారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆమె సైకిల్ పై బయలుదేరారు. ఐదారు నిమిషాల్లో చేరేంత దూరంలోనే ఆస్పత్రి ఉంది. కానీ ఆమె కాస్త జాగ్రత్తగా తొక్కుతూ పది నిమిషాల్లో ఆస్పత్రికి చేరారు. చేరిన పది నిమిషాల తరువాత ఆమెకు ప్రసూతి నొప్పులు మొదలై.. ఆడపిల్లను ప్రసవించింజి. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే… ఆమెకు ఇది రెండవ కాన్పు కాగా.. 2018లో మొదటి కాన్పు సమయంలోనూ ఆమె ఇలా సైకిల్ పైనే ఆస్పత్రికి వెళ్లింది.

నిజానికి జూలీ జెంటర్ దంపతులు అమెరికాలో పుట్టి పెరిగారు. కానీ ఆ తరువాత న్యూజిలాండ్ కు వచ్చేశారు. ఇక్కడి రాజకీయాల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. గ్రీన్ పార్టీ తరపున రవాణా వ్యవహారాలపై అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న జూలీ.. తన ఫేస్ బుక్ లో ప్రొఫైల్ లో ఆకర్షణీయమైన ట్యాగ్ ఉంటుంది. అదేమిటంటే.. ఐ లవ్ మై బైసైకిల్… బాగుంది కదూ… న్యూజిలాండ్ రాజకీయ నాయకుల్లో అత్యధికులు ఇలా నిరాడంబర జీవితాన్నే ఇష్టపడటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement