Saturday, May 25, 2024

Delhi | కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగుతుంది.. స్థానాలు అధికారికంగా ప్రకటిస్తాం : సీపీఐ నారాయణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో తమ పార్టీ పొత్తు కొనసాగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి ఏఐసీసీ నాయకత్వం తమతో మాట్లాడిందని చెప్పారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తనకు, డి.రాజాకు ఫోన్ చేసి బెల్లంపల్లి సీటు ఇవ్వలేమని… చెన్నూరు, కొత్తగూడెం టికెట్లు ఇస్తున్నామని చెప్పారని నారాయణ వెల్లడించారు.

ఇప్పటివరకు ఆ స్థానాలు తమకు ఇవ్వబోమని కాంగ్రెస్ ఎక్కడా చెప్పలేదన్నారు. సీపీఐ(ఎం)తో చర్చలు జరుగుతున్నాయని, ఒకేసారి ప్రకటన చేయాలని చూస్తున్నారని ఆయన తెలిపారు. తమకు స్థానాలు ఇవ్వము అని కాంగ్రెస్ ఎక్కడా చెప్పలేదన్నారు. అభ్యర్థుల ఖరారుపై మీడియా వార్తల్లో వాస్తవం లేదని ఆయన ఖండించారు.

- Advertisement -

అనంతరం నారాయణ చంద్రబాబు కేసులపై స్పందిస్తూ ఆయనకు బెయిల్ రావడం సంతోషంగా ఉందన్నారు. జైలులో ఉండాల్సిన వాళ్ళు బయట, బయట ఉండాల్సిన వాళ్ళు లోపల ఉంటున్నారని వ్యాఖ్యానించారు. దుబ్బాకలో బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని నారాయణ ఖండించారు. ఎవరు దాడి చేశారో దర్యాప్తు చేయకుండా రాజకీయ పార్టీలపై నిందలు వేయడం తగదని హితవు పలికారు. కోడికత్తి కేసు, వివేకా హత్య కేసు దర్యాప్తులా ఆలస్యం కాకుండా త్వరగా విచారణ జరపాలని నారాయణ డిమాండ్ చేశారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో జైలులో ఉండాల్సిన వాళ్ళు బయట, బయట ఉండాల్సిన వాళ్ళు లోపల ఉన్నారని నారాయణ అన్నారు. లిక్కర్ స్కాంలో బీజేపీ, వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై ఆమ్ ఆద్మీ పార్టీని దోషిగా చూపిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ నుంచి ఉత్తర్వులు వస్తే ఎవరైనా అరెస్ట్ అవుతారు లేదా అరెస్ట్ కాకుండా ఉంటారని నారాయణ చెప్పుకొచ్చారు. శత్రు శేషం ఉండకూడదని బీజేపీ భావిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

డిజైన్లు మార్చి లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, నాణ్యత లోపం కారణంగా మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని నారాయణ మండిపడ్డారు. విద్రోహ చర్యగా కేసు పెట్టిన పోలీసులు రాహుల్ గాంధీ పిల్లర్లు కూల్చాడని కూడా అంటారని ఎద్దేవా చేశారు. కేంద్ర కమిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడాలని చూస్తోదంని ఆయన ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై న్యాయపరమైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు. విచారణ కోరకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణకు నిరాకరిస్తే తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement