Sunday, May 19, 2024

స్థలముంటే సర్కార్‌ సాయం..

ప్రభన్యూస్‌, మహబూబ్‌నగర్‌ : రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం అధికా రంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌ పేద ప్రజలకు సొంతిల్లు ఉండాలన్న ఉద్దేశంతో డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూంను నిర్మించి ఇల్లు లేని నిరుపేదలకు అందజేశారు. దీని ద్వారా ప్రభుత్వంపై భారీగా భారం పడుతున్న నేపథ్యంలో నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు మంజూరు చేయిస్తూనే.. మరోవైపు స్థలం ఉండి ఇల్లు నిర్మాణం చేసుకొనే స్థోమత ఉన్నవారికి ఆర్థిక సాయం అందించేందుకు తెరాస ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు అందించనుంది. మూడు విడతల్లో ఈ నగదును అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ లో రూ.7,370 కోట్లను కేటాయించింది.

అయితే ఈ పథకం ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నెల చివరి నాటికి ఈ పథకం అమల్లోకి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ పథకం కింద ఎంపిక బాధ్యతలు ఎమ్మెల్యేలు చేయనున్నారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారి ఇంటి నిర్మాణానికి మూడు విడతల్లో మూడు లక్షలు అందించున్నారు. ఈ విధంగా ప్రభుత్వం నియోజకవర్గానికి మూడువేల ఇళ్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ లెక్కన ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 36వేల మందికి తొలి విడతలో అర్హులైన పేదలకు ఈ పథకం ఫలాలు అందనున్నాయి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా సొంత ఖాళీ స్దలము వంద గజాల నుంచి 300 గజాల వరకు ఉన్నవారికి సర్కారు నగదు అందిస్తుంది. లబ్దిదారులకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ ప్రక్రియలో భాగంగా మొదటి విడత రూ.లక్ష పునాదులు, పిల్లర్లు వేసిన వెంటనే ఖాతాలో నేరుగా జమకానున్నాయి. రెండో విడతలో గోడలు, స్లాబులు సమయంలో మరో రూ. లక్ష అందజేయనున్నారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యి రంగులు పూర్తయిన తరువాత మరో రూ. లక్ష రూపాయలు ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమచేయనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత స్థాయి అదికారులతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, నగదు జమ వంటి అంశాల పై మార్గదర్శకాలను సిద్దం చేసింది.త్వరలోనే ఈ పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement