Monday, April 29, 2024

బాసర త్రిపుల్‌ ఐటీ సమస్యల పరిష్కారంలో చొరవ చూపండి.. : నారాయణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలోని బాసరలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలటీ (ట్రిపుల్ ఐటీ) విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యల పరిష్కారం విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి డా. కే. నారాయణ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. విశ్వవిద్యాలయంలోని అధికారులు విద్యార్థులపై వేధింపులకు పాల్పడుతున్న వైనాన్ని లేఖలో వివరించారు. ఈ యూనివర్సిటీకి ఇప్పటికీ శాశ్వత ప్రాతిపదికన ఉపకులపతి లేరని తెలిపారు. తక్షణమే ఉపకులపతిని నియమించాలని లేఖలో పేర్కొన్నారు. వర్సిటీలోని వసతి గృహాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి నడిపిస్తున్నారని, వారు హాస్టల్స్‌ను నిర్వహించే తీరు చాలా దారుణంగా ఉందని తెలిపారు. మొత్తం 6,000 మంది విద్యార్థులు ఉంటున్న వర్సిటీ హాస్టల్స్‌లో నాసిరకమైన ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారని తెలిపారు. హాస్టళ్లను వర్సిటీ యాజమాన్యమే నిర్వహించాలని ఎంతో కాలంగా విద్యార్థులు డిమాండు చేస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. రెండు వారాల క్రితం కలుషిత ఆహారం తీసుకున్న 600 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వారిలో చాలా మంది ఆసుపత్రిపాలయ్యారని తెలిపారు. వర్సిటీలో 200కి పైగా అధ్యాపయ పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయని, దీంతో బోధనపై తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపారు. 

విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించడం సహా లైబ్రరీలో సౌకర్యాలను మెరుగుపర్చాల్సి ఉందని పేర్కొన్నారు. విద్యార్థులకు యాజమాన్యం యూనిఫాం దుస్తులు, క్రీడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న న్యాయపరమైన డిమాండ్‌ల సాధన కోసం విద్యార్థులు సమావేశమైన తరుణంలో వారిపై నిర్భంధాన్ని విధించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. క్యాంపస్‌కు తాళం వేసి పోలీసులను మోహరించి అప్రజాస్వామికంగా వర్సిటీని కాన్సంట్రేషన్‌ క్యాంపుగా మార్చారని తెలిపారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను గుర్తించి వారి సమస్యలను అత్యవసర ప్రాతిపదికన పరిష్కరించాలని సీపీఐ నేతగా కోరుతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement