Friday, March 29, 2024

చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం.. ఆగస్టు 2, 3, 4 తేదీల్లో హస్తిలో భారీ ప్రదర్శన : కృష్ణయ్య

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆగస్టు 2, 3, 4 తేదీల్లో దేశ రాజధానిలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వెనుకబడిన వర్గాలు భారీ ప్రదర్శన చేపడతాయని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ప్రకటించారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ల డిమాండ్‌తో పాటు ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ పోరాటం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఆదివారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆర్. కృష్ణయ్య జంతర్ మంతర్ ఆందోళనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి వేలామంది తరలివస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

అలాగే కేంద్రంలో ప్రత్యేకంగా ఓబీసీల సంక్షేమం కోసం మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసి, స్కాలర్‌షిప్పులు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాలకు 60 శాతం గ్రాంటు ఇవ్వాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. జనాభా లెక్కల సేకరణలో కులాలవారిగా జనగణన చేపట్టాలన్న అంశం తమ డిమాండ్లలో భాగమేనని గుర్తుచేశారు. అలాగే కులవృత్తులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రైవేటు రంగంలోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలుచేయాలని, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల నియామకాల్లోనూ ఈ రిజర్వేషన్లు అమలుపరచాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కూడా ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం బీసీలు దేశ రాజధానిలో రెండ్రోజుల పాటు కదంతొక్కుతారని ఆయన ప్రకటించారు. ఆగస్టు 9, 10, 11 తేదీల్లో పార్లమెంటు వద్ద ధర్నా చేపడతామని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement