Saturday, April 27, 2024

శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులు వాయిదా : టీటీడీ చైర్మ‌న్ సుబ్బారెడ్డి

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులను ఐదు నుండి ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నామని, త్వరలో మరో తేదీ నిర్ణయిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ఏవీ.ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతోందని చెప్పారు. తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనందనిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్‌ టెండర్లకు వెళుతున్నామని, ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో తాపడం పనులను వాయిదా వేశామని తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీవారి ఆలయంలో తాపడం పనులు పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

రథసప్తమి పర్వదినానికి ఏర్పాట్లు పూర్తి : టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ.సుబ్బారెడ్డి
తిరుమలలో శనివారం జరుగనున్న రథసప్తమి పర్వదినానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ఏవీ.ధర్మారెడ్డితో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు మొదలవుతాయని తెలిపారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవలు జరుగుతాయన్నారు. వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌, పీఏసీ-2, 4, వైకుంఠం క్యూ కాంప్లెక్సులో అన్నప్రసాద వితరణతోపాటు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టి, కాఫి, పాలు, మజ్జిగ అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement