Friday, May 20, 2022

హస్తిన వీధుల్లో శ్రీనివాసుడు, రెండో రోజు పెద్దశేషవాహనంపై ఊరేగింపు..

న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధాని హస్తిన వీధుల్లో శ్రీనివాసుడి ఊరేగింపు వైభవంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో మందిర్‌మార్గ్‌లోని బాలాజీ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఉదయం ధ్వజారోహణం నిర్వహించిన వేదపండితులు, సాయంత్రం పెద్దశేషవాహనంపై స్వామివారిని ఊరేగించారు. మరోవైపు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి ఛైర్‌పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కమిటీ సభ్యులు అంజన నగరంలోని ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు.

శుక్రవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను కలిసి ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కూడా బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. తిరుమల కొండపై నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో ఏ విధంగా పూజాదికార్యక్రమాలు జరుగుతాయో, హస్తినలోనూ అదేవిధంగా నిర్వహిస్తున్నట్టు టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి నేతలు తెలిపారు. ఈనెల 22 వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో పలువురు ప్రముఖులు హాజరై స్వామివారి ఆశీస్సులు అందుకుంటారని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement