Saturday, April 27, 2024

ఇకపై నేరుగా స్టూడెంట్స్ అకౌంట్లలోకే ఉపకార, బోధన రుసుం.. రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ఎస్సీ విద్యార్థులకు బోధన రుసుంల చెల్లింపు విధానంలో సందిగ్థత కారణంగా నిధుల విడుదల నిలిచిపోయింది. ప్రస్తుతం నేరుగా కళాశాలలకు చెల్లింపులు చేస్తుండగా.. విద్యార్థుల ఖాతాలో జమ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది. దీంతో ఈ ఏడాదికి సంబంధించి ఉపకార వేతనాలు, బోధన రుసుం నిలిచిపోయిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలు, బోధన రుసుములను కలిపి గతంలో కేంద్ర ప్రభుత్వం 15 శాతం , రాష్ట్ర ప్రభుత్వం 85 శాతం కలిపి నిధులను విడుదల చేసేది. గత ఏడాది నుంచి 60 శాతం నిధులు భరించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ లెక్కన 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి రూ. 250 కోట్లు వస్తాయని ఎస్సీ సంక్షేమ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు విద్యార్థులకు చెల్లించేందుకు ఎస్సీ సంక్షేమ శాఖ సిద్ధమైనప్పటికి కేంద్ర వాటా విడుదల కాలేదు. బోధన రుసుంలు కళాశాలల ఖాతాలోకి చెల్లించడానికి బదులు నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలని షరత్‌ విధించింది. అంతే కాకుండా ఆ షరత్‌కు లోబడి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు 40 శాతం నిధులను జమ చేసిన తర్వాతనే తమ వాటాను ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

ఇదే అంశంపై కేంద్ర సామాజిక న్యాయశాఖ కార్యదర్శి ఇటీవలనే రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్రం విధానాన్నే అమలు చేయాలని స్పష్టం చేశారు. దీని వల్ల ఎదురయ్యే సమస్యలను రాష్ట్ర అధికారులు వివరించినప్పటికి ఆయన అంగీకరించలేదు. తొలుత కేంద్రం చేసిన సూచనను అమలు చేసి, ఆ తర్వాత ఎదురయ్యే సమస్యలను వివరిస్తే ఈ మేరకు మార్పులు చేద్దామని సూచించారు. దీంతో ఎస్సీ సంక్షేమ శాఖ ఉపకార వేతనాలు, బోధన రుసుంల చెల్లింపునకు నూతన విధానం సిద్దం చేసేందుకు ఉపక్రమించింది. విద్యార్థులకే నేరుగా చెల్లించే విషయంపై నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ కొత్త విధానాన్ని కేవలం ఎస్సీ విద్యార్థులకే పరిమితం చేద్దామా..? బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకూ అదే విధానాన్ని వర్తింప చేయాలా..? అనే అంశంపైనా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ప్రభుత్వం నిర్ణయం మేరకు ముందుకు వెళ్లాలని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు భావిస్తున్నారు.

దరఖాస్తుల విధానంలోనూ మార్పులు..

ప్రస్తుతం ఉపకార వేతనాలకు. బోధన రుసుంల కోసం ఏటా విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాల్సి వస్తోంది. ఇకపై ఈ విధానానికి స్వస్తి పలికేలా మరో దస్త్రాన్ని ఎస్సీ సంక్షేమ శాఖ సిద్దం చేస్తోంది. ఈ మేరకు ఈ – పాస్‌లో ఒకసారి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే పీజీ పూర్తయ్యే వరకు ఉపకార వేతనాలు, బోధన రుసుంలు పొందవచ్చు. ఆధార్‌, విద్యార్హత, కుల దృవీకరణ పత్రాలు, సెట్‌ల సమాచారం తీసుకుని దరఖాస్తు అప్‌డేట్‌ అయ్యేలా ఎస్సీ సంక్షేమ శాఖ ఈ – పాస్‌ సాప్ట్‌వేర్లో మార్పులు చేయాలని భావిస్తోంది. విద్యార్థుల అప్‌డేట్‌ను ఎప్పటికప్పుడు కాలేజీల యజమాన్యాలు చేసేలా అవకాశం ఇవ్వనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement