Sunday, April 14, 2024

శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు.. ఏపీ, తెలంగాణలో ప్రత్యేక అభిషేకాలు

శివరాత్రి పర్వదినాన మంగళవారంరాష్ట్రంలోని ఆలయాలు శివనామస్మరణతో మార్మోగిపోయాయి. అభిషేక ప్రియుడైన బోలాశంకరుడికి భక్తులు ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు చేశారు. ప్రత్యేకించి శివాలయాల్లో ఉదయం నుంచే భక్తులు మహాదేవుడి దర్శనం కోసం పెద్ద ఎత్తున క్యూ కట్టారు. దాంతో రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. శివుడికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలను వైభవంగా నిర్వహించారు.

పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
తెలంగాణ రాష్ట్రం మెదక్‌ జిల్లాలోని పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లిలోని ఏడుపాలయ వనదుర్గా భవాని దేవస్తానంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మూడు రోజులపాటు ఏడుపాయల జాతర జరగనుంది. ప్రభుత్వం తరుపున అమ్మవారికి మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. జాతరకు వెయ్యి మంది పోలీసులతో బందోస్తు ఏర్పాటు చేశారు. వేములవాడ రాజన్న, కొమురవెల్లి, ఐనవోలు తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. మహాశివరాత్రి సందర్భంగా నల్లొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు.

హైదరాబాద్‌ నుంచి నేరుగా ఆయన చెర్వుగట్టు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారులు స్వాగతం పలికారు. కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొమురవెల్లి ఆలయంలో శివరాత్రి సందర్భంగా పెద్దపట్నం కార్యక్రమం ఇర్వహించారు. పురవీధుల్లో మల్లన్న ఊరేగింపు సేవను నిర్వహించారు. కీసరలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి.

తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా శివరాత్రి వేడుకలు..
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి నీలాద్రీశ్వర స్వామి ఆలయం, కూసుమంచి గణపేశ్వారాలయం, తీర్దాల సంగమేశ్వరాలయం, మధిర మృత్యుంజయేశ్వరస్వామి ఆలయాల్లో స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. భద్రాచలం రాములోరి ఆలయంలో శివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. గోదావరి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. నాగుపల్లి గుట్టపై కొలువుతీరిన జగదాంబ సమేత జయలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేశారు. సంగారెడ్డి జిల్లా ఝురసంగం కేతకి సంగమేశ్వరాలయంలో తెల్లవారుజామునుంచే భక్తులు మహాదేవుడి దర్శనానికి పోటెత్తారు. వరంగల్‌ జిల్లాలోని వెయిస్తంభాల ఆయలం, కాళేశ్వరం ముక్తేశ్వరస్వామి ఆలయం, కురవి వీరభద్రస్వామి, పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహాస్వామి, ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లాలోని ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వర ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేశారు. సూర్యాపేట జిల్లా పిల్లల మర్రి శివాలయాల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. నాగర్‌కర్నూలు జిల్లాలోని లలితా సోమేశ్వరాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్లమలలోని ఈ ఆలయం శివనామస్మరణతో మారుమోగిపోయింది.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ముగియాలి.. చిలుకూరు ఆలయంలో ప్రత్యేక పూజలు
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం ముగిసి శాంతియుత వాతావరణం నెలకొనాలని శివరాత్రి సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయంలో అర్చకుడు సీఎస్‌. రంగరాజన్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఉక్రెయిన్‌ వదువు లియూ బోవ్‌, హైదరాబాద్‌ వరుడు ప్రతీక్‌ రిసెప్షన్‌లో ఆయన పాల్గొన్నారు. స్వామి వారి శేషమాల, వస్త్రాలను అందించి దీవించారు. యుద్ధం త్వరగా ముగియాలని చిలుకూరు వెంకటేశ్వరస్వామిని వేడుకున్నట్లు తెలిపారు. యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రక్తపాతం, అల్లకల్లోలం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కీసర రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎస్​ సోమేశ్​కుమార్

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని కీసర గుట్ట రామలింగేశ్వరస్వామిని తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (చీఫ్ సెక్రెటరీ)  సోమేశ్​కుమార్  కుటుంబ సమేతంగా దర్శించుకొన్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్, సభ్యులు, పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగిన హైదరాబాద్ నగరానికి చేరువలో ఉన్న కీసర రామలింగేశ్వరస్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏర్పాట్లను తెలుసుకొని సంతృప్తి  వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ హరీశ్ తో పాటు అధికారులు, సిబ్బందిని అభినందించారు. సీఎస్ వెంట కలెక్టర్ హరీశ్, జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, శాంసన్ , జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్డీవోలు రవి, మల్లయ్య, ఆయా శాఖల అధికారులు, పోలీసులు, సిబ్బంది ఆలయ ఈవో, ఆలయ ఛైర్మన్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement