Wednesday, May 8, 2024

దక్షిణాదిపై రైల్వే చిన్నచూపు.. పర్యాటకానికి ఆకర్షణీయమైన ప్యాకేజీల్లేవు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దక్షిణ భారతదేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఐఆర్‌సీటీసీ ఆకర్షణీయమైన ప్యాకేజీలను అందించడంలేదని అనకాపల్లి వైసీపీ ఎంపీ డాక్టర్ సత్యవతి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె లోక్‌సభలో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలను రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు సంబంధించి తగిన రైల్వే టూర్ ప్యాకేజీలను రూపొందిస్తే అది పర్యాటక రంగానికి, రైల్వేకు మేలు చేకూరుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలలో వందలాది బౌద్ధ స్థలాలు, స్మారక చిహ్నాలు ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 బౌద్ధ స్థలాలు, స్మారక చిహ్నాలను ప్రభుత్వం గుర్తించిందన్నారు.

బౌద్ద యాత్రికులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం సర్క్యూట్, అమరావతి-నాగార్జున కొండ సర్క్యూట్‌లుగా విభజించి అభివృద్ధి చేసిందని వివరించారు. ఐఆర్‌సీటీసీ నిర్వహించే ప్రత్యేక బౌద్ధ పర్యాటక ప్యాకేజీని రాష్ట్రంలోని కీలక బౌద్ధ ప్రదేశాలను చుట్టేలా ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు. పర్యాటక ప్యాకేజీలను రూపొందించడానికి, ప్రత్యేక పర్యాటక రైళ్ల కోసం బడ్జెట్‌ను కేటాయిస్తే రైల్వే ఆదాయం పెరుగుతుందని సూచించారు. పరస్పర ప్రయోజనమైన ఈ విషయంలో రైల్వే మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement