Thursday, May 9, 2024

జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగింది. జులై 18న ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్రపతి ఎన్నికల తేదీలతో పాటు నిబంధనలు, ఏర్పాట్ల గురించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వివరించారు. రాష్ట్రపతి ఎన్నికలకు జూన్ 15న నోటిఫికేషన్ జారీ చేస్తామని, నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ జూన్ 29 అని తెలిపారు. జూన్ 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోడానికి చివరి తేదీ జులై 2 అని వెల్లడించారు. ఇక పోలింగ్ జులై 18న నిర్వహించి, జులై 21న ఓట్ల లెక్కింపు చేపడతామని తెలిపారు.

ఆర్టికల్ 324 ప్రకారం రాష్ట్రపతి ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుందని, ఈ మేరకు ఇప్పటి వరకు 15 సార్లు విజయవంతంగా ఎన్నికలు నిర్వహించామని సీఈసీ తెలిపారు. రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగుస్తోంది కాబట్టి ఈలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుందని చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభల్లోని సభ్యులతో పాటు, అన్ని రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారని వివరించారు. అయితే పార్లమెంటు, అసెంబ్లీల్లోని నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదని స్పష్టం చేశారు.

సీక్రెంట్ ఓటింగ్..

ఇక ఈ ఎన్నికలు సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ప్రాధాన్యతా ఓటు పద్ధతిలో జరుగుతాయని వివరించారు. ఒకవేళ ఎవరైనా తమ ఓటును బహిర్గతం చేస్తే ఆ ఓటు చెల్లుబాటు కాదని తేల్చి చెప్పారు. పోలింగ్ రోజు ఎన్నికల సంఘం ప్రత్యేక పెన్ను అందజేస్తుందని, ఆ పెన్నుతోనే ప్రాధాన్యతా ఓటువేయాల్సి ఉంటుందని సీఈసీ రాజీవ్ కుమార్ అన్నారు. ఎవరైనా వేరే పెన్ను ఉపయోగిస్తే ఆ ఓటు చెల్లదని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నరింగ్ అధికారిగా వ్యవహరిస్తారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అలాగే పోలింగ్ దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటుతో పాటుగా అన్ని రాష్ట్రాల్లోని శాసనసభల్లో జరుగుతుందని వివరించారు. పార్లమెంట్ ఉభయ సభల్లోని 776 మంది సభ్యులు, అన్ని రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు 4,033 కలిపి మొత్తం 4,809 మంది పోలింగులో పాల్గొంటారని సీఈసీ తెలిపారు. కొత్తగా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసినవారి పేర్లతో జాబితాను సవరిస్తామని వెల్లడించారు.

నామినేషన్ విధానం..

- Advertisement -

నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థిని కనీసం 50 మంది సభ్యులు ప్రతిపాదించాల్సి ఉంటుందని, అలాగే మరో 50 మంది సమర్థిస్తూ సంతకాలు చేయాలని రాజీవ్ కుమార్ తెలిపారు. అలాగే రూ. 15,000 డిపాజిట్‌గా చెల్లించాలని వివరించారు. అప్పుడే నామినేషన్ చెల్లుబాటు అవుతుందని అన్నారు. ఎంపీలు పార్లమెంటులో, ఎమ్మెల్యేలు తమ తమ అసెంబ్లీల్లో ఓటు వేయవచ్చని చెప్పిన సీఈసీ, ఒకవేళ ఎంపీలు ఢిల్లీ రాలేనిపక్షంలో కనీసం 10 రోజుల ముందు కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చి దేశంలో మరెక్కడైనా (వారు కోరుకున్న అసెంబ్లీలో) ఓటు వేయవచ్చునని తెలిపారు.

పార్టీల విప్ వర్తించదు..

ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విప్ జారీ చేయడానికి వీల్లేదని, ఓటు అర్హత కల్గిన ప్రతి సభ్యుడూ తమ విచక్షణతో ఓటు వేయవచ్చని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పారు. తద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టం ఈ ఎన్నికల్లో వర్తించదని స్పష్టమవుతోంది. అలాగే ఓటు కోసం బరిలో ఉన్న అభ్యర్థి లేదా అభ్యర్థి సమ్మతితో మరెవరైనా ముడుపులిచ్చినట్టు నిరూపణ జరిగితే, ఎన్నిక చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో కోవిడ్-19 ప్రొటోకాల్ అమలు చేస్తూనే పర్యావరణానికి నష్టం కలిగించని వస్తువులను మాత్రమే ఉపయోగిస్తున్నామని సీఈసీ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement