Monday, May 20, 2024

AP: చంద్ర‌బాబు ఊస‌ర‌వెల్లి.. మైనార్టీల‌పై దొంగ ప్రేమ‌..జ‌గ‌న్‌

రిజర్వేషన్ త‌ప్ప‌కుండా ఉండాల్సిందే
ఉర్దూ భాష‌కు మేమే గుర్తింపు ఇచ్చాం
ఆరు నూరైనా నాలుగు శాతం రిజ‌ర్వేష‌న్ ఇవ్వాలి
రిజర్వేషన్ రద్దు చేసే పార్టీతో బాబు దోస్తీ
చంద్రబాబు ఊసరవెల్లిలాంటోడు
మైనార్టీలపై దొంగ ప్రేమగా నటిస్తున్నాడు
వైసీపీలో ముస్లింల‌కు సముచిత స్థానం
డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చాం
క‌ర్నూలు ప్ర‌చార భేరీలో సీఎం జ‌గ‌న్‌

ఆంధ్రప్రభ స్మార్ట్, కర్నూలు ప్రతినిధి : చంద్రబాబు రాజకీయం ఊసరవెల్లిలాంటిద‌ని, అది బాగా ముదిరిపోయిన తొండగా మారింద‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ ఎద్దేవా చేశారు. కర్నూలులో గురువారం జ‌రిగిన‌ ప్రచార భేరీలో మైనారిటీల రిజర్వేషన్ల అంశంపై స్పందించారు. “చంద్రబాబు ఒకపక్క ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో జత కడతారు. మరోవైపు మైనారిటీలను మోసం చేసేందుకు దొంగ ప్రేమ నటిస్తారు.. ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఉంటాయా ?. ఆరు నూరైనా.. నూరు ఆరైనా నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట. ఇది వైఎస్సార్ బిడ్డ మాట” అని ఉద్ఘాటించారు. మైనారిటీలకు రిజర్వేషన్లపై మోదీ సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలగా ?. అసలు మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నా కూడా ఎందుకు బీజేపీతో కొనసాగుతున్నారు” అని సీఎం నిలదీశారు.

మీ బిడ్డకు కులం, మతం, వర్గం తేలీదు…
మీ బిడ్డది మనసున్న ప్రభుత్వం. కులం, మతం, వర్గం చూడకుండా ఏ పార్టీకి ఓటేశారన్నది కూడా చూడకుండా.. కేవలం పేదరికం మాత్రమే చూశాడు. వాళ్ల బతుకుల్ని మార్చడం కోసమే అడుగులు వేశాడు. కానీ, చంద్రబాబు అలా కాదు.. చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం. ఇక్కడున్న వేల జనాలకే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నప్రజలకూ చెప్పాలి. నాలుగు శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపాదికన ఇచ్చింది కాదు. ముస్లింలలోని పటాన్, సయ్యద్, మొగల్స్ లాంటి వాళ్లకు ఇవ్వడం లేదు.. కేవలం వెనుకబాటుతనం ఆధారంగానే ఈ రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే” అని జ‌గ‌న్ అన్నారు.

- Advertisement -

నా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం ముస్లిం..
అన్ని మతాల్లో బీసీలు, ఓసీలు ఉంటారు. మైనారిటీలను వేరుగా చూడడం, వాళ్ల నోటిదాకా వెళ్తున్న కూడును లాగేయడం ఎంత వరకు సబబు ? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఇది కేవలం రాజకీయ స్వార్థం కోసంవాళ్ల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాదా?.. అందుకే ఎన్నార్సీ . సీఏఏ విషయంలో… ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు, ఇజ్జత్ ఇమాందార్ కు మద్దతుగా నిలబడతాం. ఆరు నూరైనా ముస్లిం రిజర్వేషన్లు ఉండాల్సిందే అని జ‌గ‌న్ అన్నారు. ఈ ప్రభుత్వంలో మైనారిటీల కోసం షాదీ తోఫా లాంటి పథకాలు మాత్రమే ఇచ్చి ఆగిపోలేదు. ఉర్దూ భాషకు ప్రత్యేక గుర్తింపు, ఐదేళ్లు నా పక్కనే ఒక మైనారిటీ సోదరుడికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం, ఏకంగా ఏడుగురికి ఎమ్మెల్యేలుగా అవకాశమిచ్చాం.. ఇలా మైనారిటీలకు సముచిత స్థానం ఇచ్చింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నా. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ప్రతీసారి నేను ఎందుకు అంటానంటే.. ఎంతగా వారి మీద ప్రేమ చూపిస్తే వెనకబడిన ఆ వర్గాలకు రాష్ట్రంలో వారికిచ్చే గౌరవం పెరుగుతుంది. వాళ్లలో ఆత్మ స్థైర్యం, ఆత్మ గౌరవం పెరుగుతుంది. అందుకే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నేను నా.. నా.. అని చెప్తాను’’ అని జగన్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement