Tuesday, May 14, 2024

Big Story | విత్తన భాండాగారంలో చీడ ‘పురుగులుస‌.. నకిలీ ఉత్పత్తిదారులు, విక్రయదారులపై ఉక్కుపాదం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : దేశ విత్తన పరిశ్రమలో ‘తెలంగాణ’ పెద్దన్న పాత్ర పోషించడమే కాదు.. ప్రపంచ విత్తన భాండాగారంగా అవతరిస్తున్న తరుణంలో నకిలీ విత్తనాల బెడద మితిమీరుతుండడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. అనుమతి లేకుండానే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న విత్తనోత్పత్తి సంస్థలపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గట్టి నిర్ణయం తీసుకున్నారు. ల్యాబ్‌లో కూడా గుర్తుపట్టని విధంగా తయారు చేసి బ్లాక్‌ మార్కెట్లోకి వదులుతున్న కంపెనీలను పూర్తిగా నియంత్రించేందుకు అత్యంత కఠినమైన నిబంధనలతో కొత్త చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. ‘అదే పేరు.. విత్తనాలు వేరు.. భూమిలో వేసి మొలకెత్తితేనే అవి ఒరిజినల్‌, లేదంటే డూప్లికేట్‌’ అన్న విధానంతో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు ముందే గ్రామస్థాయి వరకూ విస్తరించిన నకిలీ విత్తనాలను నియంత్రించడం అధికార యంత్రాంగానికి సాధ్యం కాకుండా పోయింది.

ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం నూతన విత్తన చట్టాన్ని తీసుకువచ్చేందుకు ఉన్నతస్థాయిలో కసరత్తు జరుగుతోంది. మూడోసారి హ్యాట్రిక్‌ విజయం సాధించిన తర్వాత జరిగే మొదటి అసెంబ్లి సమావేశాల్లోనే నూతన విత్తన చట్టం ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశం మొత్తం ఉన్న విత్తన అవసరాల్లో కొన్ని రకాలు 65 శాతానికి పైగా తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నాయి. ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త భాగస్వామ్యంతో మొదలుపెట్టిన ‘సీడ్‌ విలేజ్‌’ కార్యక్రమం ద్వారా మన అవసరాలు తీర్చుకోవడంతో పాటు దేశం అవసరాలు తీర్చే స్థాయికి వ్యవసాయ రంగం ఎదిగింది.

సరాసరిగా ప్రతియేటా 65 నుంచి 75 లక్షల క్వింటాళ్ళ విత్తనాలను తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తోంది. ప్రధానంగా వరి, మొక్కజొన్న, సోయా, ఆముదం, పత్తి తదితర ప్రధాన పంటల విత్తనాలు మనవద్దే ఉత్పత్తి అవుతున్నాయి. దాదాపు అంతే మొత్తంలో నకిలీ విత్తనాలు కూడా అడ్డదారుల్లో మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. నియంత్రణకు జిల్లా, మండల స్థాయి కమిటీలు ఉన్నప్పటికీ చట్టంలో నిబంధనలు కఠినంగా లేనందుకు నిందితులపై చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త చట్టం ద్వారా నకిలీ విత్తనాలు ఉత్పత్తిదారులు, విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో నాణ్యతా ప్రమాణాలను మరింతగా పెంపొందించేందుకు కొత్త చట్టం ద్వారా పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యత పెంచనున్నారు.

- Advertisement -

ఆందోళన కలిగిస్తున్న ఉదంతాలు

దళారులు నేరుగా రైతుల వద్దకే వెళ్లి నకిలీ విత్తనాలను అంటగడుతున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో తాజాగా 2.65 టన్నుల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. ఈ సీజన్‌ ప్రారంభం మొదలుకుని ఇప్పటివరకు రాష్టర వ్యాప్తంగా మొత్తం 300లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రాష్ట్రం మొత్తం లక్షలాది మంది రైతుల వద్దకు నిషేధిత, నకిలీ పత్తి విత్తనాలు చేరి ఉంటాయనే అనుమానాలు వ్యవసాయ రంగాన్ని వెంటాడుతున్నాయి.

భారీగా మార్కెట్లోకి నిషేదిత విత్తనాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేదించిన అనేక రకాలు, కంపెనీల విత్తనాలు తెలంగాణ మార్కెట్లోకి సీజన్‌కు ముందుగానే వచ్చేశాయి. నిషేధిత హెచ్‌టీ- కాటన్‌ (బీజీ-3) విత్తనాలను కర్ణాటక, గుజరాత్‌, మహారాష్ట్రల నుంచి తరలించి తమ దళారులకు అప్పగించాయి. రైతుల్ని మోసగిస్తున్న దళారులు వారికి నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. వర్షాలు ప్రారంభమైతే మొదటగా వేసేది పత్తే కాబట్టి ఇప్పటికే హెచ్‌టీ- కాటన్‌ విత్తనాలు సరఫరా అయ్యాయి. గతేడాది నకిలీ విత్తనాలను పట్టు-కునేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాటు- చేసిన టాస్‌ఫ్కోర్స్‌ ఆ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలు పెద్దమొత్తంలో పట్టు-కుంది. అయినప్పటికీ సుమారుగా 10 లక్షల ఎకరాల్లో హెచ్‌టీ- కాటన్‌ సాగైనట్లు- తెలుస్తోంది.

రైతులను నట్టేట ముంచుతున్న ‘నకిలీ’

సీజన్‌ ప్రారంభం కాగానే రైతులు చాలావరకు గ్రామంలోని షావుకార్ల వద్దనో, విత్తన వ్యాపారుల వద్దనో అప్పు కింద విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తారు. పంట వచిన్చప్పుడు అప్పు తీర్చేలా ఒప్పందం చేసుకుంటారు. ఎలాగూ అప్పు ఇస్తున్నారు కాబట్టి వ్యాపారి ఇచ్చిన విత్తనాలనే రైతులు తీసుకుంటారు. వీటికి ఎలాంటి రశీదులు ఉండవు. విత్తన డీలర్‌ నిబంధనల ప్రకారం ఒక పత్తి విత్తన ప్యాకెట్‌ (450 గ్రాములు) అమ్మితే రూ.25-30 లాభం వస్తుంది. కానీ అదే బీజీ-3 విత్తన ప్యాకెట్‌ను విక్రయిస్తే ఏకంగా రూ.500, అదే లూజ్‌గా విక్రయిస్తే కిలోకు రూ.1,000కి పైగా ఆదాయం వస్తుంది. ఈ కారణంగానే ఏజెంట్లు- రైతులకు అక్రమ విత్తనాలు అంటగడుతున్నారు.

బీజీ-2 మాటున బీజీ-3 రంగప్రవేశం

దేశంలో బీజీ-1, బీజీ-2 పత్తి విత్తనానికి మాత్రమే అనుమతి ఉంది. అయితే ప్రస్తుతం బీజీ-2 మాత్రమే ఎక్కువగా వినియోగంలో ఉంది. అయితే బీజీ-2 పత్తి విత్తనం వేస్తున్నా గులాబీ రంగు పురుగు ఆశిస్తుండటంతో బీజీ-3 రంగప్రవేశం చేసింది. అయితే ఇది అన్ని విధాలుగా హానికరం కావడంతో దేశంలో దీని వినియోగంపై నిషేధం ఉంది. అయితే బీజీ-2కు బీజీ-3 పత్తి విత్తనానికి మధ్య తేడా గుర్తించలేని పరిస్థితి ఉండటంతో దీన్నే అవకాశంగా తీసుకొని కంపెనీల నిరాహ్వకులు, వ్యాపారులు లాభాల కోసం నిషేధిత బీజీ-3ని రైతులకు అంటగడుతున్నారు. దీంతో ఏటా బీజీ-3 సాగు చాపకింద నీరులా పెరుగుతోంది.

కాలం చెల్లిన విత్తనాల రీసైక్లింగ్‌ మోసాలు

కాలం చెల్లిన విత్తనాలను అంటగట్టి వారిని నిలువునా మోసం చేస్తున్నాయి. గడువు తీరిన విత్తనాలను రీసైక్లింగ్‌ చేసి కొత్తవని చెప్పి రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటు-న్నాయి. ఆ విత్తనం… ఈ విత్తనం అనే తేడా లేకుండా దాదాపు అన్ని రకాల విత్తనాలనూ ఇలాగే విక్రయించి రైతన్నలను నష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. ఒకసారి రూపొందించిన విత్తనాలనే మళ్లీ మళ్లీ రీసైక్లింగ్‌ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయి. నాణ్యత లేని విత్తనాల వల్ల సరైన దిగుబడి రాకపోవడంతో రైతాంగం కుదేలవుతోంది. పత్తితో పాటు- వరి, మొక్కజొన్న, సోయాబీన్‌, పత్తి, ఆవాలు, బఠానీ సహా దాదాపు 30 రకాల పంటల విత్తనాలను కూడా కంపెనీలు రీసైక్లింగ్‌ చేస్తూ రైతన్నలను దగా చేస్తున్నాయి. ఈ రీసైక్లింగ్‌ కుంభకోణంలో కొన్ని బహుళజాతి కంపెనీలు కూడా ఉండటం విస్మయం కలిగించే అంశంగా మారుతోంది. కాగా రాష్ట్రం మొత్తానికి సరఫరా అయ్యే విత్తనాల్లో దాదాపు 15 నుంచి 20 శాతం వరకు రీసైక్లింగ్‌ విత్తనాలే ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అత్యంత కఠినమైన నిబంధనలతో కొత్త చట్టం తీసుకురావాలని కేసీఆర్‌ సర్కారు భావిస్తోంది.

దురాశను అంతమొందిస్తాం : నిరంజన్‌రెడ్డి

”కొన్ని కంపెనీలు దురాశతో పత్తి విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి.. ఎక్కువ ధరకు మార్కెట్‌లో అమ్ముతున్నట్టు- ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవాలి. అలాంటి డీలర్ల లైసెన్సుల రద్దుకూ వెనకాడబోం. అవసరమైన దాని కన్నా అధికంగానే పత్తి విత్తనాలు మార్కెట్‌లో అందుబాటు-లో ఉన్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 65 లక్షల ఎకరాల విస్తీర్ణం భూమిలో పత్తి సాగవుతుందని అంచనా వేస్తున్నాం. రైతుల సౌకర్యార్థం.. 58,500 క్వింటాళ్ల పత్తి విత్తనాలు అవసరమవుతాయి. బహిరంగ మార్కెట్‌లో అన్ని కంపెనీల విత్తనాలు కలిపి 77,500 క్వింటాళ్ల వరకు అందుబాటు-లో ఉన్నాయి. పత్తి విత్తనాల లభ్యత విషయంలో రైతాంగం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పత్తి విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవు” అని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. నకిలీ విత్తనాల తయారీ, మార్కెటింగ్‌, వ్యాపారం చేసేవాళ్ళను పూర్తిగా నియంత్రించడమే లక్షర్యగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రభ టెలిగ్రామ్ చానెల్ లింక్ https://t.me/prabhaanews క్లిక్ టు జాయిన్

Advertisement

తాజా వార్తలు

Advertisement