Thursday, May 16, 2024

Delhi | పంచాయితీ ఎన్నికలు జరిపించాల్సిందే : కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో గ్రామ పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్లతో పాలన చేయడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సర్పంచుల పదవీకాలం ముగిసిందని గుర్తుచేస్తూ.. గత ప్రభుత్వ హయాంలో పంచాయితీరాజ్ వ్యవస్థ విధ్వంసానికి గురైందని ఆరోపించారు.

పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దొడ్డిదారిన కేసీఆర్ ప్రభుత్వం దారిమళ్లించిందని విమర్శించారు. కేంద్రం పంచాయితీలను బలోపేతం చేయాలన్న ప్రయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏరకమైన సహకారం కూడా అందించకుండా మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం  చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు స్పెషల్ ఆఫీసర్లతో పాలన అందించేందుకు కసరత్తు చేస్తోందని, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. 73వ రాజ్యాంగ సవరణను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని దుయ్యబట్టారు.

సకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, ఎన్నికలు నిర్వహించేవరకు ఇప్పుడున్న సర్పంచుల పదవీకాలాన్ని పొడగించాలని డిమాండ్ చేశారు. గ్రామసభలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఎన్నికల సమయంలో నేటి సీఎం రేవంత్ రెడ్డి  పదే పదే చెప్పారని గుర్తుచేశారు. స్పెషలాఫీసర్లతో పాలన జరపడం అనేది పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత నిర్వీర్యం చేయడమే అవుతుందని సూత్రీకరించారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని వ్యాఖ్యానించారు.

- Advertisement -

సర్పంచ్ ఎన్నికలను నిర్వహించకపోవడం వెనక.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను పక్కనపెట్టే ఆలోచన స్పష్టంగా కనబడుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. సర్పంచ్ లే లేకపోతే.. లబ్ధిదారుల ఎంపిక జరగదు, అది జరగకపోతే.. పథకాలను అమలుచేయాల్సిన అవసరం ఉండదు కదా అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే అధికారంలోకి వచ్చి దాదాపు 2 నెలలైందని, ఇప్పుడు ఓ నెలరోజులపాటు దీన్ని వాయిదా వేస్తే.. జనరల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తుందని, కోడ్ అమల్లోకి వస్తే.. మరో 4-5 నెలలపాటు దీన్ని వాయిదా వేయొచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement