Thursday, May 2, 2024

కివీస్‌తో పాక్‌ అమీతుమీ.. నేడు టీ20 టోర్నీలో తొలి సెమీఫైనల్‌

టీ20 ప్రపంచకప్‌లో మొదటి సెమీఫైనల్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేటి మ్యాచ్‌లో సిడ్నీ వేదికపై పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. దాదాపు ఇంటిముఖం పట్టిన దశ నుంచి అదృష్టం కొద్దీ పాకిస్తాన్‌ సెమీస్‌కు చేరుకుంది. 1992 ప్రపంచ కప్‌ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చింది. పాక్‌ అభిమానులంతా ఇప్పుడు అలాంటి మహత్తర ఘట్టం పునరావృతం అవుతుందనే ఆశతో ఉన్నారు. భారత్‌, జింబాబ్వే ఓటములతో ఖంగుతిన్న పాక్‌ జట్టుకు నెదర్లాండ్స్‌ రూపంలో అదృష్టదేవత వెన్నుతట్టింది. దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్‌ ఓడించడంతో వారు సెమీస్‌కు చేరుకున్నారు. మరోవైపు న్యూజిలాండ్‌ వారికి గట్టి ప్రత్యర్థిగా ఉంది. నాకౌట్‌కు ముందు ఒక్కసారి మాత్రమే ఈ జట్టు ఓడింది. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టుకు విజయావకాశాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. పాక్‌ బ్యాటర్లకు షార్ట్‌ బౌలింగ్‌ చేయడానికి కివీస్‌ వ్యూహాలు సిద్దం చేసుకుంటోంది. ఈ మ్యాచ్‌లో షాహీన్‌ షా ఆఫ్రిది వర్సెస్‌ ఫిన్‌ అలెన్‌ మధ్య కీలక పోరు ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

కివీస్‌ బలాబలాలు..

టిమ్‌ సౌథీ, ట్రెంట్‌ బౌల్ట్‌ కు మూడు ఫార్మాట్లలో నాలుగు ప్రపంచకప్‌ ఫైనల్స్‌ ఆడిన అనుభవం ఉంది. వైట్‌బాల్‌ ట్రోఫీని అందుకోవాలన్న వారి ఆశలు ఈసారైనా నెరవేరతాయో లేదో చూడాలి. బహుశా ప్రపంచకప్‌ నెగ్గడానికి వారికిదే చివరి అవకాశం కావొచ్చు. పాకిస్తాన్‌ ఓపెన ర్లు బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌లు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. వారిని మరోసారి కట్టడి చేయగలిగితే కివీస్‌ విజయానికి దారులు దగ్గరవుతాయి. మిచెల్‌ సంత్నర్‌ ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఎడమచేతి బ్యాటర్లకు ఏడు బంతులు మాత్రమే వేశాడు. షాన్‌ మసూద్‌, మహ్మద్‌ నవాజ్‌లను సరైన సమయంలో రంగంలోకి దింపితే అతడిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కేన్‌ విలియమ్సన్‌, డారిల్‌ మిచెల్‌ ఈ ప్రపంచకప్‌లో లెగ్‌స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మిడిల్‌ ఓవర్లలో షాదాబ్‌ ఖాన్‌ను ఎలా ఎదుర్కొంటారన్నది కీలకం.

పాక్‌ సానుకూలతలు..

ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ పాక్‌కు కీలక ఆటగాడు. బౌలింగ్‌లో షాహీన్‌ ఆఫ్రిది రాణిస్తే ప్రత్యర్థి పరుగుల వేగానికి కళ్లెం పడినట్లే. వీరికితోడు వాసిమ్‌ జూనియర్‌, నసీమ్‌ పదునైన బంతులతో రాణించగల సమర్థులు. బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఒకింత కలవరపెట్టే విషయం. ఈ మ్యాచ్‌లో మిడిల్‌ ఆర్డర్‌ రాణిస్తేనే భారీ స్కోరు లేదా ఛేదన సులువవుతుంది. హారిస్‌ పెట్రేగితే ప్రత్యర్థికి చుక్కలే. అదే సమయంలో కివీస్‌ బౌలర్ల నుంచి పాక్‌ బ్యాటర్లకు గట్టి సవాల్‌ ఎదురయ్యే చాన్స్‌ ఉంది. వారి బౌలర్లు అద్భుతమైన ఎకానమీతో సగటున ఆరు వికెట్లు పడగొట్టి మంచి ఫామ్‌లోఉన్నారు.

- Advertisement -

మెగా టోర్నీలో ఎవరెక్కడ..

2015,2019 వన్డే ప్రపంచకప్‌లలో కివీస్‌ ఫైనల్‌కు చేరింది. ఐసీసీ ప్రారంభ టెస్ట్‌ చాంపియన్‌ షిప్‌ను నెగ్గింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు చేరింది. 2009లో టీ20 చాంపియన్‌గా పాకిస్తాన్‌ నిలిచింది. అంతకు ముందు 2007లో రన్నరప్‌. పాకిస్తాన్‌ ను అంచనా వేయడం కష్టం. వారిదైన రోజున చెలరేగుతారు. వారిది పాదరస స్వభావం.

న్యూజిలాండ్‌ జట్టు (అంచనా):

ఫిన్‌అలెన్‌, డేవన్‌ కాన్వే (కీపర్‌), కానే విలియమ్సన్‌ (కెప్టెన్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌, డారెల్‌ మిచెల్‌, జేమ్స్‌ నీషమ్‌, మిచెల్‌ సంత్‌నర్‌, టిమ్‌ సౌథీ, ట్రెంట్‌ బౌల్ట్‌, సోధి, లూకీ ఫెర్గూసన్‌

పాకిస్తాన్‌ జట్టు (అంచనా):

రిజ్వాన్‌ (కీపర్‌), బాబర్‌ అజామ్‌ (కెప్టెన్‌), మహ్మద్‌ హారిస్‌, షాన్‌ మసూద్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, మహ్మద్‌ నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌, మహ్మద్‌ వాసిమ్‌, నసీమ్‌ షా, షాహీన్‌ షా ఆఫ్రిది, హరిశ్‌ రౌఫ్‌.

పిచ్‌ రిపోర్టు: (బాక్స్‌)

ఎస్‌సీజీ మైదానంలోఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్‌ చేసిన జట్లు ఐదు గెలిచాయి. అందుచేత టాస్‌ కీలకం కానుంది. సూపర్‌ 12 ప్రారంభ మ్యాచ్‌లో ఇదే పిచ్‌పై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తలపడ్డాయి. సిడ్నీలో ఇప్పటి వరకు ఉపయోగించిన మూడు పిచ్‌లలో ఇది చదునైనది. బ్యాటింగ్‌కు అనుకూలమైంది. ఉదయం వేశ వర్షం పడే సూచనలు కూడా ఉన్నాయి. మ్యాచ్‌ ప్రారంభ సమయానికి వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement