Monday, May 13, 2024

రెండేళ్లలో 1700 కొత్త విమానాలకు ఆర్డర్‌

భారత విమానయాన సంస్థలు వచ్చే రెండేళ్ల కాలంలో 1500 నుంచి 1700 కొత్త విమానాలకు ఆర్డర్‌ ఇవ్వనున్నట్లు ఏవియేషన్‌ కన్సల్టెన్సీ కాపా తాజా నివేదిక అంచనా వేసింది. ఎయిరిండియా 500 విమానాల ఆర్డర్‌తో ముందు వరుసలో ఉండొచ్చని తెలిపింది. ప్రస్తుతం దేశీయ విమానయాన రంగంలో 700 విమానాలు సేవలు అందిస్తున్నాయి. ప్రపంచంలోని అతి పెద్ద విమానయాన సంస్థల సామర్థ్యంతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువ.

- Advertisement -

కొవిడ్‌ అనంతర కాలంలో మంచి అవకాశాలు గల విమానయాన మార్కెట్‌గా భారతదేశం యావత్‌ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నదని అభిప్రాయపడింది. మార్కెట్‌ వృద్ధి అవకాశాలు పరిగణన లోకి తీసుకుంటే ప్రతీ విమానయాన సంస్థ కూడా అధిక సంఖ్యలో విమానాలకు ఆర్డర్లు జారీ చేయవచ్చునని అంచనా వేసింది. ప్రస్తుతం భారత విమానయాన సంస్థలు 800 విమానాలకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చి ఉన్నాయి.

500 విమానాల ఆర్డర్‌తో ఇండిగో తొలి స్థానంలో ఉంది. కొవిడ్‌కు ముందే మరో 300 విమానాలకు ఆర్డర్‌ జారీ చేయాలని భావించినా తాత్కాలికంగా వాయిదా వేసింది. దాన్ని ఇప్పుడు 500కి పెంచే ఆస్కారం ఉన్నట్టు కాపా తెలిపింది. ఇదిలా ఉండగా జనవరిలో విమాన ప్రయాణికుల సంఖ్య 1.25 కోట్లకు చేరినట్టు ఇక్రా తాజా నివేదికలో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement