Thursday, May 16, 2024

చమురు తంటా.. పెట్రోల్‌, డీజెల్‌ ధరల తగ్గింపుతో కొంతే నష్టం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్‌, డీజెల్‌ ధరలతో కేంద్రమే భారీగా లబ్ధి పొందుతోంది. 2014 నుంచి ఏనాడూ వ్యాట్‌ పెంచని తెలంగాణ వంటి రాష్ట్రాల వాటా పన్నుల ఆదాయంలో కేంద్రం తగ్గించిన ఎక్సయిజ్‌ పన్నుతో కోతలు పడుతున్నాయి. అయినప్పటికీ ఇంకా వ్యాట్‌ తగ్గించలేదనే విమర్శలను కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. అయితే వాస్తవానికి కేంద్రంతోపాటు, తెలంగాణకూ ఆదాయం తగ్గుతోంది. కానీ, రాబడిలో కేంద్రానిది పెద్దన్న పాత్రగా ఉంది. వచ్చే రాబడిని వివిధ రూపాల్లో రాష్ట్రాలకు ఎగవేస్తూ టోకుగా తన ఖాతాలో జమ చేసుకుంటోంది. ఇలా చమురుపై ఏటా రూ.4 లక్షల కోట్లు కేంద్ర సర్కార్‌కు చేరుతున్నాయి. తాజాగా పెట్రోల్‌పై రూ.8, డీజెల్‌పై రూ.6లను ఎక్సైజ్‌ పన్ను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం తద్వారా ఏటా రూ.లక్ష కోట్ల రాబడి కోల్పోతున్నట్లు చెబుతోంది. కానీ 2014 నుంచి నేటి వరకు బీజేపీ సర్కార్‌ హయాంలో రూ.26 లక్షల కోట్ల రాబడిని దేశవ్యాప్తంగా చమురు ఉత్పత్తులపై పన్నులు, సెస్‌ల రూపంలో ఆర్జించింది. అయితే తగ్గించామని గొప్పలు చెబుతున్న బీజేపీ వ్యవహారం 2014తో పోలిస్తే మరింత పెంపులోనే ఉన్నాయని స్పష్టమవుతోంది. 2014 మే 26న లీటర్‌ పెట్రోల్‌ రూ.71.41 ఉండగా, లీటర్‌ డీజెల్‌ రూ.55.49గా ఉంది. అయితే అప్పట్లో చమురు బ్యారెల్‌ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 108 డాలర్లు ఉండగా, ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్యారెల్‌ చమురు ధర 111 డార్లుగా ఉంది. ఈ రెండు శాతం తేడా ఎనిమిదేళ్లు అలాగే కొనసాగుతూ రాగా, పెట్రోల్‌ ధర 30శాతంపైగా, డీజెల్‌ ధర 44శాతంపైగా ఎక్కువగా పెరిగింది.

రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందేమో…

కేంద్రం పన్ను విధిస్తే వాటిపై వచ్చే రాబడిలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతో దొడ్డి దారిలో సెస్‌లను కేంద్రం వాడుకుంటోంది. రాష్ట్రాల వాటాలో పన్నుల తగ్గుదల, అప్పుల సేకరణలో నియంత్రణలు, షరతుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వ్యవహారం పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పలు రాష్ట్రాలు అంటున్నాయి. అన్ని రాష్ట్రాల లెక్కలను చూపిన కేంద్ర ప్రభుత్వం అత్యధికం తాను పెంచిన పన్ను భారాన్ని రాష్ట్రాలపై నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది కాలంలో పెట్రోల్‌, డీజెల్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం పెెంచినప్పటికీ, ఏ రాష్ట్రం కూడా వ్యాట్‌ను పెంచలేదు. పెట్రోల్‌పై 2019, అక్టోబర్‌ నాటికి కేంద్ర పన్నులు రూ.19.98గా, డీజెల్‌పై లీటరుకు రూ.15.83గా ఉండేవి. ఇందులో నుంచి పెట్రోల్‌పై లీటరుకు రూ.2.98, డీజెల్‌పై రూ.4.83 రాష్ట్రాలకు వాటా వచ్చేది. కానీ కేంద్ర ప్రభుత్వం 2019 అక్టోబర్‌లో, 2020 మార్చి నెలలో, మే నెలలో స్పెషల్‌ ఎడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ, రోడ్‌ ఇన్‌ఫ్రా పేరుతో సెస్‌లను విధించుకుంటూ డీజెల్‌పై రూ.31.83, పెట్రోల్‌పై రూ.32.98కి చేర్చింది. అయితే వాటిని పన్నులుగా పేర్కొనకుండా, సుంకాలుగా పేర్కొని రాష్ట్రాలకు ఆదాయాన్ని ఎగవేసింది. అయితే తెలంగాణ సర్కార్‌ ఏనాడూ వ్యాట్‌ను పెంచలేదు. కానీ కేంద్ర దోపిడీ కారణంగా రాష్ట్రాల ఆర్థిక నియంత్రణ దెబ్బ తింటోంది. ప్రాధాన్యతల వారీగా ఖర్చులలో లోటుపాట్లు ఎదురవుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement