Sunday, May 19, 2024

Big Story: భారత్‌కు చమురు వరద, నిన్న రష్యా.. నేడు ఇరాన్‌.. దిగుమతులకు అంగీకారం

భారతీయ వాహనదారులకు ఇది గుడ్‌ న్యూస్‌గానే భావించొచ్చు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత.. ఇంధన ధరలు భారీగా పెరుగుతాయని అందరూ అనుకున్నారు.. కానీ అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ విషయంలో నెలకొన్న పోటీ.. భారతీయులకు కొంత ఊరట ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతుల ద్వారానే భారత్‌ సమకూర్చుకుంటున్నది. భారత్‌కు తక్కువ ధరకే ముడి చమురును సరఫరా చేస్తామని ఇప్పటికే రష్యా ప్రకటించిన నేపథ్యంలో.. తాజాగా ఇరాన్‌ కూడా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. దీంతో భారతీయ ఆయిల్‌ కార్పొరేషన్‌ సంస్థల్లో పోటీ నెలకొంది. ఎవరు తక్కువ ధరకు ముడి చమురు ఇస్తారో.. వారి వద్ద నుంచే కొనుగోలు చేస్తామంటూ ప్రకటిస్తున్నారు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఓ దశలో బ్యారెల్‌ ధర 139 డాలర్లను తాకింది. మళ్లి ప్రస్తుతం 100 డాలర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చౌకగా చమురు సమకూర్చుకునే పనిలో పడింది. ఎవరు తక్కువకు ఇస్తే.. వారి నుంచి తీసుకునేందుకు నిర్ణయించింది.

స్వల్పంగా తగ్గే అవకాశాలు..!

ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. అదేవిధంగా అమెరికా నుంచి కూడా చమురు దిగుమతులు పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. భారత్‌లో భారీగా చమురు చేరుకుంటే.. ఇంధన ధరలు కూడా స్వల్పంగా తగ్గే అవకాశాలు ఉంటాయని ఇంధన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా నుంచి చమురు దిగుమతులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అగ్రరాజ్యం నుంచి చమురు దిగుమతుల్లో 11 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లపై ఇటీవల భారత్‌పై అమెరికా విమర్శలు గుప్పించింది. దీనికి భారత్‌ కూడా గట్టిగానే తిప్పికొట్టింది. ఇంధన వనరుల్లో స్వయం సమృద్ధి సాధించిన దేశాలు, రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్న దేశాలు భారత్‌ చట్టబద్ధ దిగుమతులను రాజకీయం చేయడం తగదని హితవు పలికింది. ఈ తరుణంలో అమెరికా నుంచి కూడా భారత్‌ దిగుమతులను పెంచుకునేందుకు నిర్ణయించింది.

అమెరికాకు భారత్‌ ధీటైన సమాధానం

రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో.. అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇతర దేశాల నుంచి విమర్శలు వస్తున్నా భారత్‌ లెక్కచేయడం లేదు. దేశీయ అవసరాలకు దిగుమతులే కీలకం కావడంతో.. ఎక్కడ చౌకగా దొరికితే అక్కడే కొంటామని తెగేసి చెబుతున్నది. రష్యా నుంచి చేసుకుంటున్న చమురు దిగుమతులకు ఆంక్షలు వర్తించనప్పటికీ.. ఆ అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నాలు చేయడాన్ని భారత్‌ తీవ్రంగా తప్పుబడుతున్నది. అయినా దేశ ముడి చమురు అవసరాల కోసం రష్యా నుంచి చేసుకుంటున్న దిగుమతులు ఒక్క శాతం కన్నా తక్కువే అని తెలిపింది. రష్యా, భారత్‌ల మధ్య రూబుల్‌, రూపాయి మారకంలో వాణిజ్యం గతంలోనే జరిగిన విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి గుర్తు చేశారు. ఇంధన అవసరాలకు భారత్‌ అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతుందని గుర్తు చేసిన ఆయన.. దేశీయ అవసరాల రీత్యా ప్రపంచ మార్కెట్స్‌లో ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు. అనేక దేశాలు, ముఖ్యంగా ఐరోపా దేశాలు కూడా ఇదే పని చేస్తున్నాయని గుర్తు చేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement