Sunday, May 26, 2024

Final Stage: జిల్లాల పునర్విభజనపై నెలాఖరుకు తుది నోటిఫికేషన్‌.. ఉగాది నుంచే పాలన

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరింది. ఉగాది నుంచే పాలన ప్రారంభించాలనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి లక్ష్యాల మేరకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. కొత్త జిల్లాలకు సిబ్బంది, ఫర్నిచర్‌ కేటాయింపులూ దాదాపు పూర్తి కావొచ్చాయి. ఉద్యోగులు, ఫర్నిచర్‌ కేటాయింపులు జరగని జిల్లాలకు ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల పునర్విభజనపై ప్రాథమిక నివేదిక ఇప్పటికే ముఖ్యమంత్రి పరిశీలన కోసం వెళ్లింది. సీఎం ఆదేశాలకు అనుగుణంగా నెలాఖరుకు తుది నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.

కొత్త జిల్లాల సరిహద్దులు, రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు తదితర వివాదాలపై రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
పాలన, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి శాసనసభలో ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునే శాసనసభ ద్వారా ముఖ్యమంత్రి వైఖరి స్పష్టం చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఆదేశాల మేరకు గత నెలలో ప్రభుత్వం జిల్లాల పేర్లు, సరిహద్దులను నిర్ణయిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. పార్లమెంటు నియోజకవర్గాలను ప్రాతిపదికగా చేసుకొని కొత్త జిల్లాల ఏర్పాటులో సమీప గ్రామాలు, పట్టణాలను కలిపారు. ఇదే సమయంలో ఇప్పుడున్న శాసనసభ స్థానాలు చెదరకుండా చూడాలని, ప్రతి జిల్లాలో మూడు రెవిన్యూ డివిజన్లు ఉండేలా ఏర్పాటు చేయడంతో వివిధ ప్రాంతాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. అభ్యంతరాలు, సూచనలు, సలహాల కోసం ఈ నెల 3వ తేదీ వరకు గడవు ఇవ్వగా 12వేల వరకు వచ్చినట్లు తెలిసింది. విజయనగరం, కృష్ణా, కడప జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే వచ్చిన అభ్యంతరాలపై అధికారులు నివేదికలో సవివరంగా పొందుపరిచారు. ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై నివేదికలో అధికారులు స్పష్టం చేశారు.

భవనాల కేటాయింపు కొలిక్కి..
రాష్ట్రంలోని కొత్త జిల్లా కేంద్రాలకు భవనాల కేటాయింపు కొలిక్కి వచ్చింది. అందుబాటులోని ప్రభుత్వ భవనాలను కొత్త జిల్లాలకు కేటాయించారు. ఒకటి రెండు చోట్ల చిన్నపాటి ఆటంకాలు ఉన్నప్పటికీ రెండు మూడు రోజుల్లో సర్థుకుంటుందని అధికారులు చెపుతున్నారు. కొత్త జిల్లా కలెక్టర్ల కార్యాలయాల మరమ్మతులకు రూ.39 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో సివిల్‌, విద్యుత్‌ పనులకు జిల్లాకు రూ.కోటి, జిల్లా, డివిజన్‌ స్థాయి కార్యాలయాల్లో ఫర్నిచర్‌ కొనుగోళ్లకు రూ.రెండేసి కోట్ల చొప్పున ఒక్కొక్క జిల్లాకు కేటాయించింది. ఫర్నిచర్‌, వాహనాల కేటాయింపు పూర్తి కావొచ్చింది. ఆయా జిల్లాలకు ఫర్నిచర్‌ కేటాయింపులు జరిగాయి. కొన్ని చోట్ల వాహనాల కేటాయింపు మినహా మిగిలిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.
మార్పులు, చేర్పులు..

కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రధానంగా మండలాల విలీనం, డివిజన్ల ఏర్పాటు పైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా రెవిన్యూ డివిజన్లు 51 నుంచి 63 వరకు పెంచారు. కొన్ని మండలాలను వేర్వేరు ప్రాంతాలకు కలిపారు. వివిధ వినతుల నేపధ్యంలో రెవిన్యూ డివిజన్ల సంఖ్యను 73 వరకు పెంచే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల మండలాల విలీనంపై పునరాలోచన చేసి సాధ్యాసాధ్యాల మేరకు మార్పులు, చేర్పులు చేయనున్నారు. సీఎం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఆయా మార్పులు ఉండొచ్చని అధికారులు చెపుతున్నారు.

శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి ప్రకటన చేయనున్నారు. సోమ, మంగళవారాల్లో సీఎం ప్రకటన ఉంటుందని అధికార వర్గాల సమాచారం. 26 జిల్లాల ఏర్పాటు, ఆయా జిల్లాల ఏర్పాటులో తీసుకున్న భౌగోళిక పరిస్థితులు, మార్పులు, చేర్పులపై సీఎం స్పష్టమైన వైఖరి తెలపనున్నారు. ఎప్పటి నుంచో జిల్లాల పునర్విభజన డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ఆ డిమాండ్‌కు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాన్ని సీఎం వెల్లడిస్తారు. గత వారం జరిగిన సమావేశాల్లోనే సీఎం ప్రకటన ఉంటుందని భావించారు. అయితే అధికారుల నుంచి నివేదిక రాకపోవడంతో వాయిదా పడింది. ఆ తర్వాత అన్ని లాంఛనాలను వేగంగా పూర్తి చేసి తుది నోటిఫికేషన్‌ ద్వారా ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement