Wednesday, May 22, 2024

Delhi: యాచించడం కాదు, ఇకపై శాసిస్తాం.. బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడిగా జాజుల శ్రీనివాస్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన ఎన్నికల్లో జాతీయ కార్యవర్గం శ్రీనివాస్ గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఇంతకాలం పాటు సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షులిగా ఉన్న ఆర్. కృష్ణయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవడంతో తాజా ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఎన్నికల్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా క్రాంతికుమార్ యాదవ్ ఎన్నికయ్యారు. 1997 నుంచి వెనుకబడిన వర్గాల హక్కులు, సంక్షేమం కోసం ప్రజాఉద్యమంలో ఉన్న జాజుల, తొలుత బీసీ విద్యార్థి సంఘం, ఆ తర్వాత బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2016 నుంచి బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ వచ్చారు. సోమవారం జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన పేరును ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కే. శంకర్ రావు ప్రతిపాదించగా, 18 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు సమర్థిస్తూ ఏకగ్రీవంగా జాతీయాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. బీసీల హక్కుల కోసం గత 25 సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా పనిచేస్తున్న జాజుల శ్రీనివాస్ గౌడ్‌ను గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ ఉద్యమాన్ని నిర్మించడంలో కీలకంగా వ్యవహరించారు.

ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్ బభన్ రావ్ తైవాడే (మహరాష్ట్ర), కేసన శంకరావు (ఆంద్రప్రదేశ్), ఇంద్రజిత్ సింగ్ (పంజాబ్), జాన్కర్ మహదేవ్ (నాగపూర్), నరేష్ షా (బిహర్), రఘువీర్ సింగ్ (డిల్లి), షకీల్ పాటిల్ (ఉత్తర్ ప్రదేశ్), శ్రీరాములు (కర్ణాటక), సచిన్ రాజోల్కర్ (పూణె), కుల్కచర్ల శ్రీనివాస్ (తెలంగాణ) నాగ మల్లేశ్వరావు, కనకాల శ్యాం కుర్మ, తాటికొండ విక్రం గౌడ్, మణిమంజరి, బైరి రవికృష్ణ గౌడ్, నరేష్ ప్రజాపతి, దాడి మల్లన్న యాదవ్, జాజుల లింగం, ఈడిగ శ్రీనివాస్, స్వర్ణ, జ్యోతి, సధానందం, ప్రసాద్, గాజుల నాగరాజు, నర్సింహ నాయక్, గండిచేరువు వెంకన్న, పాలకూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

చివరి శ్వాస వరకు పోరాడుతా: జాజుల శ్రీనివాస్ గౌడ్.
దేశ జనాభాలో అతిపెద్ద సమూహంగా ఉన్న బీసీలు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడచిన తర్వాత కూడా జనాభా దామాషా పద్ధతిన రాజ్యాంగబద్ధంగా రావలసినటువంటి అన్ని హక్కులను పొందలేకపోతున్నారని, అతి తక్కువ జనా భా కలిగిన అగ్రవర్ణాలు దేశంలో అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. దేశంలో 5 వేలకు పైగా ఉన్నటువంటి బీసీ కులాలలో నేటి వరకు చట్టసభల గడపదొక్కని ఎన్నో కులాలు ఉన్నాయని, ముఖ్యంగా సంచార జాతులు అత్యంత వెనుకబడిన వర్గాలు, ఓబీసీలు, సామాజిక రాజకీయ నిర్లక్ష్యానికి, అణిచివేతకు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై బీసీల హక్కుల కోసం యాచించడం ఉండదని, రాజకీయాలను శాసించేలా జాతీయస్థాయి ఉద్యమాన్ని నిర్మిస్తామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement