Wednesday, May 8, 2024

ప్రయాణికులకు అందుబాటులోకి కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన సేవలను అందించే లక్ష్యంగా టీఎస్‌ ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. రవాణా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది. ప్రయాణికులు సురక్షితమైన గమ్యస్థానం చేరుకునేందుకు వీలుగా బస్సులలో అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కమార్‌ శనివారం తొలి విడతగా కొత్త 50 సూపర్‌ లగ్జరీ బస్సులను ట్యాంక్‌బండ్‌పై ప్రారంభించనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.392 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1016 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. వీటిలో 630 సూపర్‌ లగ్జరీ, 130 డీలక్స్‌, 16 స్లీపర్‌ కోచ్‌ బస్సులను కొనుగోలుకు టెండర్ల ద్వారా ఆర్డర్‌ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం బస్సులన్నీ వచ్చే ఏడాది 2023 నాటికి అందుబాటులోకి వస్తాయి. శనివారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులు ఆధునాతన సాంకేతికతను కలిగి ఉంటాయి.

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్‌ సదుపాయం కూడా ఉంటుంది. ప్రయాణికులకు మార్గమధ్యంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే పానిక్‌ బటన్‌ను నొక్కగానే టీఎస్‌ ఆర్టీసీ కంట్రోల్‌ రూంకు ముందుగా సమాచారం అందుతుంది. ఈ సమాచారం ద్వారా అధికారులు వేగంగా స్పందించి ప్రయాణికుల భద్రతకు సంబంధించిన చర్యలు తీసుకుంటారు. అలాగే, ప్రతీ బస్సులోనూ సౌకర్యవంతమైన 36 రిక్లైనింగ్‌ సీట్లుంటాయి. ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రతకు బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలతో పాటు ప్రతీ బస్సుకు రివర్స్‌ పార్కింగ్‌ కెమెరా కూడా ఉంటుంది. అత్యాధునికమైన ఫైర్‌ డిటెక్షన్‌ అలారం సిస్టం ఏర్పాటు చేసిన కారణంగా బస్సులో మంటలు చెలరేగిన పక్షంలో ఇది వెంటనే అప్రమత్తం చేస్తుంది.

ఉష్టోగ్రత పెరిగిన వెంటనే అలారం ఆటోమేటిక్‌గా మోగి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ సూపర్‌ లగ్జరీ బస్సుల్లో సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ సదుపాయంతో పాటు వినోదం కోసం టీవీలను సైతం ఏర్పాటు చేయడం జరిగింది. కాగా, శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ట్యాంక్‌బండ్‌పై జరిగే కార్యక్రమంలో తొలి విడతగా 50 సూపర్‌ లగ్జరీ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, రహదారి, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, టీఎస్‌ ఆర్టీసీ ఎండీ విసి సజ్జన్నార్‌, రవాణా శాఖ కమిషనర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌ పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement