Thursday, May 2, 2024

సరూర్‌నగర్ పరువుహత్యపై జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మతాంతర వివాహం చేసుకున్న ఓ దళిత యువకుణ్ణి నడిరోడ్డుపై పట్టపగలే దారుణంగా హతమార్చిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం సూమోటోగా కేసు నమోదు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి నోటీసులిస్తూ 4 వారాల్లోగా సమగ్ర నివేదిక అందజేయాల్సిందిగా శుక్రవారం ఆదేశించింది. ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వేగంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు తమ దృష్టికొచ్చిందని, అయితే పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఇలాంటి ఘటనలు అరాచకత్వానికి నిదర్శమని, ఇది తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన అని ఎన్‌హెచ్ఆర్సీ ప్రకటనలో పేర్కొంది.

మతాంతర, కులాంతర వివాహాలు జరిగినప్పుడు పరువుహత్యలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏదైనా విధానం ఉందా అంటూ చీఫ్ సెక్రటరీని కమిషన్ ప్రశ్నించింది. సీఎస్ తన నివేదికలో ఈ అంశంపై బదులివ్వాలని పేర్కొంది. ఈ హత్యోదంతం దర్యాప్తు స్థితిగతులు, బాధిత కుటుంబానికి కల్పిస్తున్న భద్రత, దర్యాప్తులో అధికారుల నిర్లక్ష్యం ఏదైనా ఉంటే అలాంటివారిపై తీసుకున్న చర్యల గురించి నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపీని ఆదేశించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement