Saturday, May 25, 2024

Delhi | ఉమ్మడి పౌరస్మృతి సంస్కరణాత్మక బిల్లుకు ముస్లిం మహిళల మద్దతు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో విస్తృతంగా చర్చకు దారితీసిన ఉమ్మడి పౌరస్మృతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ ముస్లిం మహిళల్లో కొందరు కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు పలికారు. యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి) కోసం తీసుకొచ్చే బిల్లును సంస్కరాణాత్మక చర్యగా పేర్కొంటూ సమర్ధిస్తున్నామంటూ ప్రకటించారు. తాహెరా ట్రస్ట్ వ్యవస్థాపకురాలు జహరా బేగం ముస్లిం మహిళలతో కలిసి లా కమిషన్ ఛైర్మన్‌తో పాటు కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని కలిసి మద్దతు లేఖను అందజేశారు.

యూనిఫాం సివిల్ కోడ్ ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను తొలగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే ఇండోనేషియా తర్వాత అత్యధిక సంఖ్యలో ముస్లింలు ఉన్నది భారతదేశంలోనేనని, కాలం చెల్లిన చట్టాలు అమల్లో ఉండడంతో దేశంలో ముస్లింలు, ముస్లిం మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. చట్టాల ప్రకారం ముస్లిం పురుషులకు బహుభార్యత్వానికి వెసులుబాటు ఉండడంతో ట్రిపుల్ తలాఖ్‌ను దుర్వినియోగం చేస్తూ వచ్చారని, ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా కేంద్రం ట్రిపుల్ తలాఖ్ రద్దు చేసిందని ఆమె గుర్తుచేశారు.

ముస్లిం పర్సనల్ లా అంటూ షరియత్ చట్టాలను అనుసరిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఇస్లామిక్ దేశాల్లోనే ఎన్నో చట్టాలను మార్చేస్తున్నారని, అక్కడ జరగుతున్నన్ని నిర్మాణాత్మక సంస్కరణలు భారతదేశంలో అమలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరబ్ దేశాలతోపాటు అనేక ఇస్లామిక్ దేశాల్లో ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని ఎప్పుడో రద్దు చేశారని గుర్తుచేశారు. దేశంలోని గత ప్రభుత్వాలు ముస్లిం మహిళల నిజమైన అభివృద్ధి గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని, కాలం చెల్లిన ఈ విధానం కారణంగా వారు తీవ్ర అన్యాయానికి గురయ్యారని అన్నారు.

- Advertisement -

భారతదేశంలోని మునుపటి ప్రభుత్వాలు ముస్లిం సమాజాన్ని సంతృప్తి పరచడంలో మాత్రమే మునిగిపోయాయని, అందుకే సంస్కరణల జోలికి వెళ్లలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం కులమతాలకు అతీతంగా దేశంలో ఒకే విధమైన పౌర చట్టాలను తీసుకురావడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా మొత్తం ముస్లిం సమాజానికి గొప్ప సేవ చేసినట్టేనని ఆమె అభివర్ణించారు. ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న న్యాయపరమైన అడ్డంకులను యూనిఫాం సివిల్ కోడ్ తప్పకుండా తొలగిస్తుందని, ప్రతిపాదిత బిల్లులో ముస్లిం పురుషులు, ముస్లిం మహిళల మధ్య అంతరాలు తొలగి సమానత్వం ఏర్పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

భారతదేశంలోని ముస్లింలలో యూనిఫాం సివిల్ కోడ్ పై ఉన్న అభిప్రాయాలు ఏకరీతిలో ఉన్నాయని భావించడం సరికాదని, సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని గుర్తించాలని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. కొంతమంది ముస్లింలు ప్రతిపాదిత బిల్లుపై ఆందోళన, అభ్యంతరాలు వ్యక్తం చేయడం నిజమే అయినప్పటికీ ముస్లింలందరూ దీనికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పడం సమంజసం కాదని జహరా బేగం అన్నారు. లింగ బేధం, మతపరమైన వ్యత్యాసాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, భద్రత కల్పించే సమాజాన్ని సృష్టించడం ఇప్పుడు చాలా కీలకమని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియలో ముస్లిం మహిళల అభిప్రాయాలకు చోటు కల్పించాలని ఆమె లా కమిషన్‌తో పాటు కేంద్ర న్యాయశాఖను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement