Thursday, May 2, 2024

Delhi | మన్ కీ బాత్ ఓ సామాజిక విప్లవం: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం.. జన్ కీ బాత్ (ప్రజావాణి), దేశ్ కీ బాత్ (దేశ వాణి) గా ప్రజల గుండెల్లో చోటు దక్కించుకుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ ను పురస్కరించకుని ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ ప్రాంగణంలో.. మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీగారు ప్రస్తావించిన పలు అంశాల ఆధారంగా ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటుచేశారు. ఆదివారం సాయంత్రం కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖితో కలిసి కిషన్ రెడ్డి ఈ గ్యాలరీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు సమర్థవంతంగా తెలియజేయడంలో మన్ కీ బాత్ ఎంతో  సానుకూల ప్రభావాన్ని చూపించిందన్నారు. పక్క ఊర్లో కూడా తెలియని వ్యక్తి చేసిన అసామాన్యమైన పనులను దేశమంతా తెలియజేయడం, గుర్తింపు దక్కని వారికి సరైన గుర్తింపును కల్పించడంలో మన్ కీ బాత్ కార్యక్రమం చక్కని వేదికగా మారిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రజలకు సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూనే.. వారి శక్తి సామర్థ్యాలను ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూ.. వారిని కూడా సమాజం, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడంలో మోదీజీ విజయం సాధించాన్నారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ నినాదాన్ని మనసా, వాచా, కర్మణా.. పాటిస్తున్న ప్రధాని పట్ల ప్రజలు అదే స్థాయిలో ఆదరణ చూపిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. 

- Advertisement -

స్వచ్ఛందంగా ఎల్పీజీ  సబ్సిడీ విషయంలో వదులుకున్న సందర్భంలో, ఖాదీకి పట్టం కట్టే విషయంలో, భారతీయ బొమ్మల పరిశ్రమకు అండగా  నిలిచే విషయంలో, కరోనా సమయంలో నిబంధనల అమలు విషయంలో.. ఇలా ప్రతి అంశంలోనూ ప్రజలు మోదీ గారి పిలుపునకు సానుకూలంగా స్పందించారన్నారు.

అంతకుముందు, కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షీ లేఖి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం అనే మాటకు ప్రధానమంత్రి అసలు సిసలు అర్థాన్నిచ్చారన్నారు. ఓ తరం కింద అంతరించిపోయిందనుకున్న రేడియోకు మళ్లీ వినియోగంలోకి తీసుకొచ్చి.. ప్రజలతో అనుసంధానానికి దాన్ని వేదికగా మార్చుకున్నందుకే ప్రజల గుండెల్లోమోదీ గారికి అంత గొప్ప స్థానం దక్కిందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ కళాకారిని, పద్మశ్రీ అంజోలీ ఇలా మీనన్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్, సంయుక్త కార్యదర్శి ముగ్ధా సిన్హా, ఈ థీమ్ క్యురేటర్ అల్కా పాండే, ప్రముఖ కళాకారిణి కిరణ్ నాడార్ తో పాటు కళాకారులు, వివిధ దేశాల అంబాసిడర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement