Friday, June 9, 2023

Big story | జలపాతాలకు మహర్దశ.. గిరిజన ప్రాంతాల్లోని జలపాతాలకు మొదటిప్రాధాన్యత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర అందాలను ద్విగుణీకృతం చేస్తూ ఆకాశమంత ఎత్తునుంచి నేలను తాకాలనే ఉబలాటంతో నురుగులు కక్కుతూజాలువారుతున్న జలపాతాల అందాలను ప్రజలంతా తిలకించేందుకు ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నది. మంచు బిందువులను తలపిస్తూ నీటితెమ్మరలతో మైమరిపింప చేసే అనేక జలపాతాల అందాలను ఆస్వాధించేందుకు ప్రభుత్వం మౌలిక సదుపాయాల పునరుద్ధరమకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జాలువారుతున్న జలపాతాలకు మరిన్ని వన్నెలు అద్దేందుకు ప్రభుత్వం డీపీఆర్‌ లను రూపొందిస్తుంది. మొదటి దశలో అభయారణ్యాల్లోని గిరిజన ప్రాంత జలపాతాల ను పర్యాటకులు సందర్శించేందుకు అవసరమైన సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో దండకారణ్యాల్లోని గిరిజన ప్రాంతాలకు వెళ్లాలంటేనే అనేక సవాళ్లను అధిగమించాల్సి వచ్చేది. దండకారణ్యాల్లోని కొన్ని జలపాతాల జాడలు పట్టణ ప్రజలకు తెలియని సందర్భాలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అనేకరంగాల అభివృద్ధితో పాటు పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో చేసిన సర్వేల్లో దండకారణ్యాల్లోని అనేక జలపాతాలు, సుందర దృశ్యాలువెలుగులోకి వచ్చాయి.

- Advertisement -
   

ఇందులో ప్రధానంగా కొమురం భీం జిల్లాలోని సప్తగుండాల జలపాతాలను వెలుగులోకి వచ్చాయి. పూర్వమెన్నడో గిరిజనులు రాజ్యం చేసినప్పటి ఆనవాళ్లతో పాటుగా తొలిమానవుడి చరిత్ర కూడా ఇక్కడ పరిశోధనకు అవకాశాలుండటంతో సప్తగుండాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకత ఇస్తూ డిపీఆర్‌ లను రూపొందిస్తుంది. అలాగే గిరిజనులు రాజ్యం ఏలారనడానికి మౌనసాక్ష్యంగా ఉన్న ఊట్నూరు కోట పునరుద్ధరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఐటిడిఏ నుంచి నిధులను మంజూరు చేశారు. ఈనిధులకు అనుకూలంగా ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి పథకాలను రూపొందిస్తుంది. త్వరలో డెండర్ల ద్వారా పనులను ఖరారు చేసి జలపాతాలకు వన్నెలు దిద్దనున్నారు. తొలి దశలో కుమురంభీం జిల్లాలోని జలపాతాలకు, ఊట్నూరు కోటకు ప్రాధాన్యత లభించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అజలాపురంజలపాతం, కనకాయ్‌ జలపాతం, గుండాల జలపాతం బొగతల జలపాతం, బీముని జలపాతం, మల్లెల తీర్థంతో పాటుగా అనేక జలపాతాలున్నాయి.

సహ్యాది పర్వతపంక్తుల్లో ని కుంటాం గ్రామానికి అతిసమీపంలో ఉన్న అభయారణ్యంలో విరాజిల్లుతున్న కుంతల జలపాతం అంతర్జాతీయంగా కూడా ప్రసిద్ది. ఏటా అనేక దేశాలనుంచి పర్యాటకులు ఇక్కడికి రావడం అనవాయితీగా మారింది. జలపాతాల మధ్యలో కాకతీయ రాజులు వాస్తురీతులతో ఉన్న శిలింగం ఈ జలపాతానకి ప్రత్యేకత ఒకప్పుడు ఇక్కడికి వెళ్లడం అత్యంత ప్రమాదకరంగా భావించే వారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో దినదినాభివృద్ధి చెందుతూ కుంతాల జలపాతం ప్రసిద్ధి గాంచింది. పురావస్తు పరిశోధకుల పరిశోధనలమేరకు ఈ లోయప్రాంతం ఆదిమానవులకు ఆలవాలంగా ఉండేదని చెపుతారు. చాళుక్యుల అనంతరం కాకతీయ రాజులకాలంలో ఈ ప్రాంతం అభివృద్ధి సాధించి ఆనాటి రాచరిక విడిది కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేకశ్రద్ధతో కుంతల అందాలను ద్విగుణీకృతం చేస్తుంది. శివలింగాన్ని దర్శించుకునేందుకు ప్రత్యేక మెట్ల దారిని ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం కుంతల అభివృద్ధి కోసం ఐటిడిఏ రూ. 3కోట్ల 92లక్షల 60 వేల రూపాయలకు పరిపాలనాపరమైన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం డిపిఐర్‌ లను రూపొందిస్తున్నారు. ఈనిధులతో రెస్టారెంట్‌, వ్యూఫాయింట్‌, మెట్ల దారి మరమ్మత్తులు చేయనున్నట్లు సమాచారం. పూర్వం గిజనులు రాజ్యమేలిన ప్రాంతాల్లోని సప్తగుండాల జలపాతానికి మహర్దశ పట్టనుంది. కమురంభీం జిల్లాలోని లింగాపూర్‌ మండలం పిట్టగూడు రెండుకిలో మీటర్ల దండకారణ్యంలో సప్తగుండాల జలపాతం ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం. ఇప్పటివరకు పర్యాటకులకు దీనిగురించి పూర్తి సమాచారం లేదు. పర్యాటక శాఖ జరిపిన పర్యావేక్షణలో సప్తగుండాలు వెలుగుచూశాయి. అయితే ప్రస్తుతం ఈ జలపాతాలు పర్యాటకులకు అందు బాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుంది. ఈ జపాతాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఐటిడిఏ రూ.కోటీ 35లక్షల,41 వేల500 లకు పరిపాలనా పరమైన అనుమతులు లభించాయి. అలాగే రాష్ట్రంలో అతిప్రాచీన మైన గిరిదుర్గాల్లో గిరిజనులు పాలించిన ఊట్నూరు కోట సుప్రసిద్ధ దుర్గం.

ఈ కోటాభివృద్ధి కోసం ఇప్పటికే రాష్ట్ర పురావస్తు శాఖ పరిశోధనలు చేసి డిపిఆర్‌ లను రూపొందించింది. అయితే గిరిజనుల సంస్కృతికి,రాజ్యపాలనకు నిదర్శనంగా నిలిచిన ఈ కోటాభివృద్ధికి ఐటిడిఏ 3కోట్ల 92లక్షల60వేల రూపాయలు కేటాయించింది. పురావస్తు శాఖ కోటాభివృద్ధి కోసం సరికొత్త ప్రణాళికలను రూపొందించడంతో పాటుగా చరిత్ర పరిశోధకుల మస్తిష్కాలకు పదునుపెట్టేవిధంగా తీర్చిదిద్దనున్నారు. నిండైన అందాలను పొదివి పట్టుకున్న జలపాతాలు రాష్ట్రానికి మకుటాయమానంగా నిలిపిందుకు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తోందనే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement