Sunday, May 19, 2024

Followup: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగ్‌దీప్ ధన్‌కర్.. రైతు-జాట్ సామాజిక సమీకరణాలకు పెద్దపీట

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార కూటమి ఎన్డీయే అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ పేరును కమలనాథులు ఖరారు చేశారు. శనివారం సాయంత్రం భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ బోర్డు ఈ మేరకు ధన్‌కర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. పార్లమెంటరీ బోర్డు సమావేశం కంటే ముందు ధన్‌కర్ సహా పలువురు గవర్నర్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవడం గమనార్హం. పార్లమెంటరీ బోర్డు భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ధన్కర్ మూడు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉన్నారని పేర్కొన్నారు. ధన్‌కర్‌ను కిసాన్ పుత్ర్ (రైతు పుత్రుడు)గా నొక్కి చెబుతూ ప్రజా గవర్నర్గా పేరు సంపాదించారని కొనిడాయారు. నవభారత్ స్ఫూర్తికి ఆయన జీవితం అద్దం పడుతుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. ఆర్థిక, సామాజికపరమైన అనేక అడ్డంకులు, అవాంతరాలు అధిగమించి ఆయన ఈ స్థాయికి చేరుకున్నారని ప్రశసించారు.

ఎవరీ ధన్‌కర్?

రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ పల్లెటూరు కిథానాలో 1951 మే 18న ఓ సాధారణ రైతు కుటుంబంలో జగ్‌దీప్ ధన్‌కర్ జన్మించారు. చిత్తోఢ్‌గఢ్ లోని సైనిక్ స్కూల్‌లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న ధన్‌కర్, జైపూర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్‌లో న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. న్యాయవాదిగా పనిచేస్తూ రాజస్థాన్ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. 1989లో జనతాదళ్ తరఫున రాజస్థాన్‌లోని ఝున్‌ఝును నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీచేసి లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందారు. నాటి ప్రధాన మంత్రి చంద్రశేఖర్ కొలువులో కేంద్ర సహాయ మంత్రిగా 1990-91 మధ్యకాలంలో పనిచేశారు. ఆ తర్వాత కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రాజస్థాన్ అసెంబ్లీలో 1993-98 వరకు ఉన్నారు. 2019 జులై 30న జగ్‌దీప్ ధన్‌కర్ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు.

జాట్-రైతు సమీకరణాలకు పెద్దపీట

అత్యున్నత రాజ్యాంగ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలోనూ సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తున్న కమలనాథులు, ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో జాట్-రైతు సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నారు. పశ్చిమ భారతదేశంలోని రాజస్థాన్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, పశ్చిమ యూపీలో జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. వ్యవసాయాధారిత సామాజికవర్గంగా పేరున్న జాట్లు ఈ పశ్చిమ భారతదేశంలోని మూడు రాష్ట్రాల రాజకీయాల్లో కీలకంగా మారారు. హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసింది కూడా ఈ వర్గంవారే. హరియాణాలో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ), యూపీలో రాష్ట్రీయ లోక్‌దళ్ వంటి రాజకీయ పార్టీలు జాట్ల ఆధ్వర్యంలో జాట్ల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ కొనసాగుతున్నాయి. అయితే జాతీయస్థాయిలో జాట్లు భారతీయ జనతా పార్టీకి మద్ధతుగా నిలబడేవారు. ఈ మధ్యకాలంలో వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వివాదాస్పద చట్టాలతో పాటు రాజకీయంగా జాటేతర వర్గాలకు బీజేపీ ప్రాధాన్యతనివ్వడంతో కాషాయదళంపై వారు ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయం గ్రహించిన కమలనాథులు జాట్లను మళ్లీ దగ్గర చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. తాజాగా జరిగిన ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు, అంతకు ముందు జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో జాట్ల ద్వారా ప్రతికూల ప్రభావం పడకుండా వ్యవహరించగలిగారు. 2024 సార్వత్రిక ఎన్నికలు, త్వరలో జరగబోయే రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జాట్లను సంతృప్తిపరిచే క్రమంలో ఆ వర్గానికి చెందిన నేత ధన్‌కర్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

- Advertisement -

ధన్‌కర్ ఎంపికలో ఎంపికలో రైతు-జాట్ సమీకరణాలతో పాటు ఆయన వ్యవహారశైలి, రాజకీయానుభవం, న్యాయవాద వృత్తి నైపుణ్యం, రాజ్యాంగ పదవి అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్టు అర్థమవుతోంది. ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యసభ చైర్మన్‌గానూ వ్యవహరించాల్సి ఉంటుంది. వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు, అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ బిల్లులను తీసుకొస్తున్నప్పటికీ, రాజ్యసభలో తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో చాలా బిల్లులు రాజ్యసభలో ఆగిపోయాయి. కొన్ని స్టాండింగ్ కమిటీల పరిశీలనకు వెళ్లాయి. ఈ పరిస్థితుల్లో రాజ్యసభను సజావుగా నడిపించడం అనేది కూడా కమలనాథులకు కీలకంగా మారింది. ధన్‌కర్ ఈ విషయంలో న్యాయం చేయగలరని అధిష్టానం భావించింది. అందుకే ఆయనకు పట్టం కట్టింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement