Monday, May 6, 2024

దండకారణ్యంలో మంత్రి స‌త్య‌వ‌తి పర్యటన.. ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : ఒకప్పటి మావోయిస్టుల కంచుకోట అయిన దండ‌కారణ్యం వైపు చూడాలంటేనే భ‌యం భ‌యంగా ఉండేది. అటువైపు వెళ్లడానికి లీడ‌ర్లు, అధికారులు సాహసం చేసేవారు కాదు. నిత్యం పోలీసుల బూట్ల చప్పుళ్లు, కుంబింగ్ లతో ఉండే బీభ‌త్సంగా దండకారణ్యం ఏరియా ప్రస్తుతం వరద తాకిడికి గుర‌య్యింది. గోదారి ప్రకోపానికి అటవీ గ్రామాల ప్రజలు అల్లాడిపోయారు. కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మారుమూల అటవీ ప్రాంతం పలిమెల, మహాముత్తారం మండలాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం ప‌ర్య‌టించారు. మహాముత్తారం మండలం పెగడపల్లి పునరావాస కేంద్రాన్ని సందర్శించిన‌ అనంతరం కామన్ పల్లి, కనుకునూరు మీదుగా పలిమెల మండల కేంద్రానికి వెళ్లి వరద బాధితులను పరామర్శించారు.

జిల్లా కేంద్రానికి సుమారు 65 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న‌ కారడవిలో మంత్రి స‌త్య‌వ‌తి కాన్వాయ్ సహోసోపేతంగా వెళ్లి సురక్షితంగా తిరిగి రావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్షాలకు పలిమెల, మహాముత్తారం మండలాల్లో దారి పొడవున ఉన్న‌ కల్వర్టులు, లోలెవల్ వంతెనలతో పాటు రోడ్డు అంతా డ్యామేజ్ అయి ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పోలీసు అధికారులను అలర్ట్ చేస్తూ మంత్రి వెంట పరిస్థితులను పర్యవేక్షించారు. భూపాలపల్లి, కాటారం డిఎస్పీలు రాములు, బోనాల కిషన్ నేతృత్వంలో సుమారు నలుగురు సీఐలు, 12 నుంది ఎస్సైలు, టీఎస్ఎస్పీ, స్పెషల్ పార్టీ, సివిల్ సిబ్బంది 200మంది బందోబస్తులో పాల్గొన్నారు. కాన్వాయ్ జిల్లాకు చేరుకునే దాకా దారి పొడవునా పోలీసులు నిఘా పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement